Telugu Gateway
Top Stories

అమెరికా కంటే మ‌న ద‌గ్గ‌రే మ‌హిళా పైల‌ట్లు ఎక్కువ‌!

అమెరికా కంటే మ‌న ద‌గ్గ‌రే  మ‌హిళా పైల‌ట్లు ఎక్కువ‌!
X

ఒక‌ప్పుడు మ‌హిళా పైల‌ట్లు అంటే విమాన సిబ్బందితోపాటు ప్ర‌యాణికులు కూడా ఒకింత భ‌య‌ప‌డేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే దీనికి ఏకంగా మూడు ద‌శాబ్దాల స‌మ‌యం పట్టింది. 1989లో ప్ర‌పంచంలోనే అత్యంత పిన్న‌వ‌య‌స్కురాలైన కెప్టెన్ గా నివేదితా బాసిన్ రికార్డు క్రియేట్ చేశారు. నివేదితా భాసిన్ స‌మయంలో విమాన పైల‌ట్లుగా మ‌హిళ‌లు అంటే అదేదో అరుదైన విష‌యంగానే చూసేవారు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే భార‌త్ లోనే అత్య‌ధిక సంఖ్య‌లో మ‌హిళా పైల‌ట్లు ఉన్నారు. భార‌త్ లో మొత్తం పైల‌ట్ల‌లో మ‌హిళల వాటా 12.4 శాతం ఉండ‌గా..అగ్ర‌రాజ్యం అమెరికాలో కేవ‌లం ఇది 5.5 శాతం మాత్ర‌మే ఉంది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమాన‌యాన మార్కెట్ అమెరికాదే అన్న విష‌యం తెలిసిందే. యూకెలోనూ మ‌హిళా పైల‌ట్ల వాటా 4.7 శాతంగానే ఉంది. పైల‌ట్లుగా మ‌హిళ‌ల సంఖ్య పెర‌గ‌టం వెన‌క ప‌లు అంశాలు ఉన్న‌ట్లు గుర్తించారు. వీరు మంచి ప‌నితీరు క‌న‌పర్చ‌టంతో సిబ్బంది కొర‌త స‌మ‌స్య‌ను తీర్చ‌టానికి కూడా వీరు ఉప‌యుక్తంగా ఉన్న‌ట్లు గుర్తించారు.

పురుషుల‌తో పోలిస్తే వీరు త్వ‌ర‌గా ఉద్యోగాలు మార‌టం వంటివి చేయ‌ర‌నే అభిప్రాయం ఉంది. కార్పొరేట్ విధానాలు మార‌టంతోపాటు కుటుంబాల‌ప‌రంగా కూడా ఈ ఉద్యోగంలో చేరేందుకు మంచి మ‌ద్ద‌తు ల‌బిస్తున్న‌ట్లు గుర్తించారు. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల పైల‌ట్ ట్రైనింగ్ కార్య‌క్ర‌మానికి ప్రోత్సాహ‌కాలు అందిస్తుండ‌గా..కొన్ని కార్పొరేట్ సంస్థ‌లు 18 నెల‌ల ఫ్లైయింగ్ కోర్స్ కు పూర్తి స్థాయిలో స్కాల‌ర్ షిప్స్ కూడా అందిస్తున్నాయి. దేశంలోని ప్ర‌ముఖ ఎయిర్ లైన్స్ మ‌హిళా పైల‌ట్ల‌కు వారి వెసులుబాటును బ‌ట్టి ప్రెగ్నెంట్ గా ఉన్న‌స‌మ‌యంలో కూడా వారి భ‌ద్ర‌త‌కు ప్రాముఖ్య‌త ఇస్తూ ఇత‌ర చోట్ల వారికి చోటు క‌ల్పిస్తున్నారు. గ‌త ఏడాది అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో నుంచి బెంగుళూరుకు మొత్తం మహిళా సిబ్బందితోనే ఓ నాన్ స్టాప్ విమానం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఇది పెద్ద సంచ‌ల‌నంగా మారింది. వ‌చ్చే ఇర‌వై సంవ‌త్స‌రాల కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా ఆరు ల‌క్షల మంది పైల‌ట్లు అవ‌స‌రం అవుతార‌ని బోయింగ్ అంచ‌నా వేసింది.

Next Story
Share it