ఒక్క రోజు కేసులే రెండు లక్షలు దాటేశాయ్
భారత్ కరోనా కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా ఇవి నమోదు అవుతున్నాయి. ఒక్క రోజులోనే దేశంలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కరోనా తొలి నాళ్ళ కంటే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అనూహ్యంగా ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షల మార్క్ ను దాటేసింది. గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మరణాల సంఖ్య 1038గా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య1.40 కోట్లను దాటేసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లోనూ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 3,307 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా నిన్న ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది.