Telugu Gateway
Top Stories

సంప‌న్న ఎగ‌వేత‌దారులు బ్యాంకుల‌ను ముంచింది 2.4 ల‌క్షల కోట్లు

సంప‌న్న ఎగ‌వేత‌దారులు బ్యాంకుల‌ను ముంచింది 2.4 ల‌క్షల కోట్లు
X

ఈ జాబితాలో విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీ లేరు. కానీ ఏకంగా 255 మంది సంప‌న్న ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారులు ఉన్నారు. వీరు అంతా క‌ల‌సి బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 2.4 ల‌క్షల కోట్ల రూపాయ‌లు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే ఈ ఎగ‌వేత మొత్తం 87 దేశాల జీడీపీ కంటే ఎక్కువ‌గా ఉండ‌టం విశేషం. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయ‌ల పైబ‌డిన మొత్తాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ్గొట్టిన వారు 36 మంది వ‌ర‌కూ ఉన్నారు ఈ జాబితాలో. ఇందులో మూడు వేల కోట్ల రూపాయ‌లుపైన ఎగ్గొట్టిన వారు ముగ్గురు ఉంటే..2000 కోట్ల రూపాయ‌ల నుంచి 3000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఎగ్గొట్టిన వారి సంఖ్య ఆరుగా, 1000 నుంచి 2000 కోట్లు ఎగ్గొట్టిన వారి సంఖ్య 27 మంది, 500 నుంచి 1000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ చెల్లించ‌ని వారు 37 మంది, 400 నుంచి 500 కోట్ల రూపాయ‌లు చెల్లించ‌ని వారు 28 మంది ఉన్నారు. ప‌దేళ్ల క్రితం ఉద్దేశపూర్వ‌క ఎగ‌వేత‌దారుల మొత్తం బాకీ 23 వేల కోట్ల రూపాయ‌లు ఉంటే..2018 నాటికి అది ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు చేర‌గా..2020 నాటికి రెండు ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు పెరిగింది. చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకున్న వారు..కోటి రూపాయ‌ల లోపు రుణం తీసుకున్న వారి ఎగ‌వేత‌లు త‌గ్గాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ రుణ ఎగవేత‌ల‌కు సంబంధించి ఓ స‌మ‌గ్ర‌మైన కథ‌నాన్ని ప్ర‌చురించింది.

ఇక్క‌డ మ‌రో కీలక‌మైన విష‌యం ఏమిటంటే ఈ సంప‌న్న ఎగ‌వేత‌దారులు అంద‌రూ ఎగ‌నామం పెట్టింది అంతా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కే కావ‌టం విశేషం. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా నామ‌మాత్రంగా మాత్ర‌మే ఉంది. అయితే ఇందులోనూ ఎస్ బిఐ , దాని అనుబంధ బ్యాంకుల వాటానే మొత్తం వాటానే 71,896 కోట్ల రూపాయ‌లు కాగా..ఈ వాటా 30.4 శాతంగా ఉంది. ఆ త‌ర్వాత స్థానంలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు 39,455 కోట్ల రూపాయ‌లు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29860 కోట్ల రూపాయ‌లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 25,440 కోట్ల రూపాయ‌లు, ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్ 21,751 కోట్ల రూపాయ‌లుగా ఉన్నాయి. మ‌రో విశేషం ఏమిటంటే దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబ‌య్ న‌గ‌రం ఉన్న రాష్ట్రం అయిన మ‌హారాష్ట్ర అత్య‌ధిక మంది ఎగ‌వేత‌దారులు ఉన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత స్థానంలో ఢిల్లీ ఉంటే..మూడ‌వ స్థానంలో ప‌శ్చిమ బెంగాల్, నాల్గ‌వ స్థానంలో గుజ‌రాత్, ఐద‌వ స్థానంలో తెలంగాణ‌, ఆర‌వ స్థానంలో త‌మిళ‌నాడు ఉంది.

Next Story
Share it