విమానయానం సాధారణ స్థితికి అప్పుడే
ఎప్పటికప్పుడు అంచనాలు మారిపోతున్నాయి. ఈ వేసవికి విమానయాన రంగం గాడినపడుతుందని స్వయంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు నిపుణులు కూడా గత ఏడాది చివర్లో ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఊహించని స్థాయిలో విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ తో అంతా అల్లకల్లోలం అయింది. ఈ దెబ్బకు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల వేల కోట్ల రూపాయల మేర నష్టాల బాట పట్టాయి. తాజాగా హర్దీప్ సింగ్ పూరి విమానయాన రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 సంవత్సరంలో దేశంలోని పౌరులు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అయితే వచ్చే ఏడాదికే విమానయాన రంగం కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. కేసులు తగ్గుముఖం పడుతూ పోతే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీలు... ఈ రంగంలోని నిపుణులు మాత్రం సాధారణ స్థితికి రావటానికి 2023 వరకూ పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
వీరి అంచనాలకు భిన్నంగా కేంద్ర మంత్రి వచ్చే ఏడాదే ఇది సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు ముందు దేశంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య నాలుగు లక్షలుగా ఉండేదన్నారు. 2020 మే 25న దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చిన తర్వాత తొలుత రోజుకు 30 వేల మంది ప్రయాణికులు ఉండగా..తర్వాత ఇది 3.13 లక్షలకు పెరిగిందని తెలిపారు. రెండవ వేవ్ ప్రారంభానికి ముందు ప్రయాణికులు ఈ మేరకు పెరిగారన్నారు. ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన వచ్చే ఏడాదే సాధారణ స్థితికి చేరుకుంటామని తెలిపారు. కరోనా రెండవ వేవ్ కారణంగా విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేషియో కొత్త కనిష్టాలను నమోదు చేశాయన్నారు.