దూసుకెళ్లిన ఎయిర్ లైన్స్ షేర్లు
విమానయాన రంగ కంపెనీల షేర్లు చాలా కాలం తర్వాత దూసుకెళ్ళాయి. మార్చి 27 నుంచి అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో జోష్ మొదలైంది. ఇప్పటివరకూ కేవలం ఎయిర్ బబుల్ ఒప్పందం కింద మాత్రమే పలు అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మార్చి 27 నుంచి ఎప్పటిమాదిరిగానే సర్వీసులకు అనుమతించనున్నారు. దీంతో తిరిగి ఈ రంగం గాడిన పడేందుకు మార్గం సుగమం అయింది. దీంతోపాటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తాము నాటోలో చేరబోమని చేసిన ప్రకటన కూడా మార్కెట్ కు ఊపునిచ్చింది.
ఇండిగో విమాన సర్వీసులను నడిపే సంస్థ ఇంటర్ గ్లోబ్ కంపెనీ షేర్లు 111 రూపాయల లాభంతో 1711 రూపాయలకు చేరింది. మరో సంస్థ స్పైస్ జెట్ 3.45 రూపాయల లాభంతో 60.45 రూపాయలకు, జెట్ ఎయిర్ వేస్ 4.45 రూపాయల లాభంతో 93.90 రూపాయలతో పెరిగాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్లో బుధవారం నాడు పలు రంగాలకు చెందిన షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1223.24 పాయింట్ల లాభంతో 54,647.33 పాయింట్ల వద్ద ముగిసింది. ఎయిర్ లైన్స్ తోపాటు ఆతిథ్య రంగానికి చెందిన షేర్లు కూడా లాభాల బాటలోనే సాగాయి.