డిసెంబర్ నాటికి దేశంలో 108 కోట్ల మందికి వ్యాక్సిన్
కేంద్ర వ్యాక్సినేషన్ విధానంపై ప్రస్తుతం పలు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాలు కూడా కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఎంత వరకూ విజయవంతం అవుతుందో తెలియదు కానీ..పలు రాష్ట్రాలు మాత్రం వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్ల బాట పట్టాయి. ఈ తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అవుతుందని.. ఈమేరకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ వేస్తున్న దేశాల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే 20 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. 108 కోట్ల మందికి..216 కోట్ల డోసులు ఇచ్చేందుకు అంతా రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ప్రకాష్ జవదేకర్ స్పందించారు. 130 కోట్ల దేశ జనాభాలో ఇప్పటివరకూ కేవలం మూడు శాతం లోపే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందని రాహుల్ విమర్శించారు. డిసెంబర్ నాటికి 108 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సిద్ధమైన బ్లూప్రింట్ గురించి రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. పలు రాష్ట్రాలు తమకు కేటాయించిన కోటా వ్యాక్సిన్లను కూడా తీసుకోలేదని విమర్శించారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్ పై లేని పోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.