అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం

పొడిగింపు. మళ్ళీ పొడిగింపు. గత ఏడాదికిపైగా ప్రతి నెలా ఇదే వరస. అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై ప్రతి నెలా ఇలా నిషేధపు ఉత్తర్వులు ఇచ్చుకుంటూ పోతునున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి పూర్తి కాకపోవటంతో విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. గత ఏడాది మార్చి 22 నుంచి ఈ నిషేధం అలా పొడిగిస్తూ పోతున్నారు. అమెరికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిషేధం ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. అయితే పలు దేశాల మధ్య పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు సాగుతున్నాయి. కరోనాకు ముందు ఉన్న తరహాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటికి పునరుద్ధరిస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తాజాగా డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సెప్టెంబర్ 30 వరకూ అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీసీఏ ఆమోదించిన, కార్గొ విమానాలకు ఈ నిషేధం వర్తించదు. అంతర్జాతీయంగా విమానయానాన్ని గాడినపెట్టేందుకు వ్యాక్సిన్ పాస్ పోర్టును తెరపైకి తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే పలు దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్ వో ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులు వేసుకున్న వారిని నేరుగా తమ దేశంలోకి రావొచ్చని అనుమతిస్తున్నాయి. మరికొన్ని అయితే రెండు డోసులు పూర్తి అయిన వారు కూడా ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తో రావొచ్చని అనుమతిస్తున్నాయి. పలు పర్యాటక దేశాలు కూడా పర్యాటకులను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.