లాక్ డౌన్ పై ఐసీపీఎంఆర్ కీలక వ్యాఖ్యలు
దేశమంతటా ప్రస్తుతం లాక్ డౌన్..కర్ఫ్యూలు అమలు అవుతున్నాయి. రెండవ దశ కరోనా నియంత్రణకు ఒక్కో రాష్ట్రం ఒక్కో మోడల్ ను ఫాలో అవుతున్నాయి. పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తుండగా..మరికొన్ని మాత్రం పరిమితి ఆంక్షలతో నడిపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడైనా సరే కరోనా పాజిటివిటి రేటు పది శాతంపైన ఉంటే ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విధించాల్సిన అవసరం ఉంటుందని ఐసీఎంఆర్ సూచించింది. పాజిటివిటి రేటు పది శాతంపైన ఉన్నా లాక్ డౌన్ పెట్టకపోతే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పాజిటివిటి రేటు పది నుంచి ఐదు శాతం లోపు ఉంటే ఆంక్షలు సడలించుకోవచ్చన్నారు. అధిక పాజిటివిటి ఉంటే మాత్రం లాక్ డౌన్ అనివార్యం అని తెలిపారు. భార్గవ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పాజిటివిటి రేటును ప్రస్తావించారు.
ప్రస్తుతం అక్కడ పాజిటివిటి రేటు 35 శాతం నుంచి 17 శాతానికి తగ్గిందని..ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక పాజిటివిటి రేటు గోవాలో ఉందని భార్గవ తెలిపారు. దేశంలోని 718 జిల్లాల్లో దాదాపు 310 జిల్లాల్లో పాజిటివిటి రేటు సగటున 21 శాతం కంటే ఎక్కువ ఉందన్నారు. గోవాలో పాజిటివిటి రేటు 48 శాతం ఉంటే..హర్యానాలో 37 శాతం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో పాజిటివ్ రేటు పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో పాజిటివిటి రేటు 9 శాతం ఉంటే..ఏపీలో మాత్రం 23 శాతం ఉందని తెలిపారు. జాతీయ టాస్క్ ఫోర్స్ పాజిటివిటి రేటు 10 శాతం పైన ఉంటే ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్ డౌన్ విధించాలని సూచించింది.