విదేశాల్లో ఉన్న భారతీయలు పంపిన మొత్తం ఎనిమిది లక్షల కోట్లు !
భారత్ కు చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళతారనే విషయం తెలిసిందే. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు ఏ మాత్రం నైపుణ్యం లేని వారు కూడా ఉంటారు. నైపుణ్యం లేని వారు ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళతారు. 2022 లో విదేశాల్లో పని చేస్తున్న వారు దేశంలోకి ఏకంగా ఎనిమిది లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు ) పంపినట్లు సమాచారం. ఈ విషయాన్నీ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. 2021 లో విదేశాల నుంచి వచ్చిన మొత్తం 7 .5 శాతం పెరగ్గా..2022 లో ఇది 12 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అధిక ఆదాయం వచ్చే దేశాల్లో పని చేసే భారతీయులు కరోనా సందర్భంగా ఆయా దేశాలు ఇచ్చిన భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందారని ఈ నివేదికలో ప్రస్తావించారు.
విదేశాల నుంచి నిధులు అందుకునే దేశాల్లో భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. భారత్ కు వచ్చే నిధులు దగ్గరదగ్గర 100 బిలియన్ డాలర్లు ఉండగా...అదే మెక్సికో కు 60 బిలియన్ డాలర్లు, చైనా 51 బిలియన్ డాలర్లు ఈ మార్గంలో పొందుతున్నాయి. 2016 -17 నుంచి 2020 -21 వరకు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ ల నుంచి వచ్చే మొత్తం 26 శాతం నుంచి 36 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో గల్ఫ్ అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ , ఒమన్, ఖతార్ నుంచి వచ్చే మొత్తాలు 54 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయి. అయితే 2023 లో మాత్రం మాంద్యం కారణంగా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.