వ్యాక్సిన్ పాస్ పోర్టుపై భారత్ అభ్యంతరం
ఏడాదిన్నరపైగా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయానం..పర్యాటక రంగాలు దారుణంగా నష్టాలు చవిచూశాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పలు దేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఇలా చేయటం ద్వారా కొంతలో కొంత ఆయా రంగాలకు ఊరట కల్పించినట్లు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీని కోసం పలు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే..వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే ఆయా దేశాల్లోకి అనుమతిస్తారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి పెద్దగా ఉండదని..దీంతోపాటు పర్యాటకం..విమానయాన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందనేది ఆయా దేశాల ఆలోచన. దీనిపై ఇంకా కసరత్తులు సాగుతున్నాయి. అయితే భారత్ మాత్రం వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
జీ7 వైద్య ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో వ్యాక్సిన్ పాస్ పోర్టు ప్రతిపాదనను భారత్ తరపున పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది భారత్ తోపాటు చాలా దేశాలకు నష్టం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కేవలం మూడు శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందిందని..ఈ దశలో వ్యాక్సిన్ పాస్ పోర్టు వల్ల దేశ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అభివద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా మెల్లగా సాగుతోందని..ఇప్పుడు ఆయా దేశాలకు వ్యాక్సినేషన్ అతి పెద్ద సవాల్ గా మారిందన్నారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు జీ7 దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పలుద దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారిని మాత్రమే అనుమతిస్తున్నాయి.