Telugu Gateway
Top Stories

సినిమా బడ్జెట్ కన్నా చంద్రయాన్ 3 ఖర్చే తక్కువ

సినిమా బడ్జెట్ కన్నా చంద్రయాన్ 3 ఖర్చే తక్కువ
X

తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఇంటర్ స్టెల్లార్ ఇంగ్లీష్ సినిమా బడ్జెట్ 1350 కోట్లు. ఇది సైన్స్ ఫిక్షన్..అడ్వెంచర్ మూవీ. ఇప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్య పోయేలా ..భారత్ సాధించిన అద్భుత విజయం చంద్రయాన్ 3 ఖర్చు ఎంతో తెలుసా?. కేవలం 615 కోట్ల రూపాయలు. అంటే ఒక ఇంగ్లీష్ సినిమా బడ్జెట్ కంటే అతి తక్కువ వ్యయంతో భారత్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారు అనే చెప్పొచ్చు. ఏ దేశం సాధించని ఘనతను భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) సాధించి భారత పతాకాన్ని రెప రెపలాడించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపి ఒక కొత్త చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో అగ్రగాములుగా చెప్పుకునే అమెరికా, రష్యా, చైనాలు సాధించలేని రికార్డు ను భారత సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. జులై 14 న ప్రారంభం అయిన చంద్రయాన్ 3 మిషన్ బుధవారం సాయంత్రం విజయవంతంగా పూర్తి అయింది. కొద్ది రోజుల క్రితమే రష్యా కు చెందిన లూనా 25 మిషన్ ఫెయిల్ కావటంతో భారత్ ప్రయోగంపై అందరిలో మరింత ఉత్కంఠ రేపింది. ప్రపంచ కప్ క్రికెట్ లో ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే ఉండే ఉత్కంట కు మించి దేశంలోని ప్రజలు అందరూ ఊపిరి బిగబట్టి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని వీక్షించారు అని చెప్పొచ్చు. 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి జాబిల్లిపై చంద్రయాన్‌-3 దిగింది.

అసలు పని ఇక ఇప్పుడు ప్రారంభం కానుంది. చంద్రుడి నిర్మాణం, పరిమాణం, అక్కడి వాతావరణంపై పూర్తిగా అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించనుంది. 14 రోజుల పాటు చంద్రుడిపై రోవర్‌ ప్రజ్ఞాన్‌ పరిశోధనలు కొనసాగనున్నాయి. చంద్రయాన్‌-3 ఘన విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఇస్రో దక్షిణ ధృవాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్లు భావిస్తుండడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని నాసా కూడా గుర్తించింది. దక్షిణ దృవంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉంటాయి. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. భారత విజయంపై అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. చంద్రయాన్ 3 విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం అవటంతో ..దాన్నుంచి పాఠాలు నేర్చుకుని ఇస్రో ఈ సారి గురి చూసి కొట్టి సూపర్ సక్సెస్ సాధించి జయహో అంటూ భారత కీర్తి పతాకను చంద్రుడిపై ఎగరేసింది.

Next Story
Share it