Telugu Gateway
Top Stories

సీఈవోల త‌యారీ కేంద్రంగా భార‌త్!

సీఈవోల త‌యారీ కేంద్రంగా భార‌త్!
X

అమెరికా అగ్ర‌రాజ్య‌మే. కానీ అగ్ర‌రాజ్యం అమెరికాలోని అగ్ర‌శ్రేణి కంపెనీల‌ను న‌డిపేది అంతా భార‌తీయులే కావ‌టం విశేషం. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అమెరికాలోని కీల‌క కంపెనీలు అన్నింటికి భార‌తీయులు సార‌ధ్యం వ‌హిస్తున్నారు. ఇది దేశంలోని యువ‌త‌లో కూడా స్పూర్తి నింపుతుంద‌నే చెప్పొచ్చు. ఏదో అలా నియామ‌కాలు చేసుకోవ‌ట‌మే కాదు..వీరికి చెల్లిస్తున్న వేత‌నాలు..ప్రోత్సాహ‌కాలు చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే. ఇప్ప‌టికే అమెరికాలో గూగుల్ మాతృ సంస్థ ఆల్పాబెట్ ఐఎన్ సీ సీఈవోగా సుంద‌ర్ పిచాయ్ ఉన్న విష‌యం తెలిసిందే. ట్విట్ట‌ర్ కు ప‌రాగ్ అగ‌ర్వాల్, మైక్రోసాఫ్ట్ కు స‌త్య నాదెళ్ల‌, అడోబ్ ఐఎన్ సీకి శంత‌న్ నారాయ‌ణ్‌, ఐబీఎంకు అర‌వింద్ క్రిష్ణ‌, ఫెడ్ ఎక్స్ కు రాజ్ సుబ్రమ‌ణియం, బార్ క్లేస్ కు సీఎస్ వెంక‌ట‌క్రిష్ణ‌న్ సీఈవోలుగా ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి మ‌రీ భార‌తీయుల‌ను సీఈవోలుగా నియ‌మించుకుంటున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్‌ స్టార్‌బక్స్‌ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్​ నరసింహన్​ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ ప్రకటించింది. న‌ర‌సింహ‌న్ 1957 ఏప్రిల్ 15న పూణేలో జ‌న్మించారు.

ప్రస్తుతం స్టార్‌బక్స్‌ సీఈఓగా ఉన్న హోవర్డ్​ షుల్ట్​జ్​ స్థానంలో లక్ష్మణ్​ నరసింహన్‌నుఎంపిక చేసింది. అయితే రానున్న అక్టోబర్‌లో కంపెనీ చేరనున్న నరసింహన్‌ ఏప్రిల్1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ ''రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు. న‌ర‌సింహ‌న్ ఇటీవ‌ల వ‌ర‌కూ డ్యూరెక్స్ కండోమ్స్, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్‌ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవినుంచి వైదొలగుతున్నట్టు స్టార్‌బక్స్‌ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. 1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి దానిలో అధికారం చేపట్టిన తొలి ప్రవాస భారతీయుడు కూడా. అలాగే గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసింహన్‌ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్‌ ఔట్‌లెట్స్‌ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది.

Next Story
Share it