Telugu Gateway
Top Stories

తొలిసారి మాంద్యంలోకి భారత ఆర్ధిక వ్యవస్థ!

తొలిసారి మాంద్యంలోకి భారత ఆర్ధిక వ్యవస్థ!
X

భారత ఆర్ధిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోంది. దేశ చరిత్రలో ఇది తొలిసారి కావటం విశేషం. కరోనానే దీనికి కారణంగా చెబుతున్నారు. 2020 జులై -సెప్టెంబర్ త్రైమాసికలో దేశ జాతీయోత్పత్తి (జీడీపీ) 8.6 శాతం మేర తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో భారత్ తొలిసారి మాంద్యం కోరల్లో చిక్కుకోనుందని ఆర్ బిఐ అధికారి ఒకరు వెల్లడించారు. వరసగా రెండు త్రైమాసికాలు జీడీపీ ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేయటంతో సాంకేతికంగా భారత్ మాంద్యంలోకి వెళ్లినట్లే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఈ త్రైమాసికం జీడీపీ గణాంకాలు నవంబర్ 27న విడుదల కానున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌- జూన్‌)లోనూ జీడీపీ ఏకంగా 24 శాతం పతనం అయిన విషయం విదితమే. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశం మాంద్యంలోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్‌ తెలియజేసింది.

అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీలు వ్యయాల్లో కోత విధించడం, తద్వారా నిర్వహణ లాభాలను పెంచుకోవడం వంటి అంశాలను ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. వాహన అమ్మకాలు, బ్యాంకింగ్‌ లిక్విడిటీ తదితరాలను సైతం మదింపు చేశారు. అక్టోబర్‌లో ఆర్థిక రివకరీని ఇవి సంకేతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే.. మూడో త్రైమాసికం(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ఆర్థిక వ్యువస్థ తిరిగి వృద్ధి బాట పట్టనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత నెలలో పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితులను అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ తదితర అంశాలపై ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయనే విమర్శలు ఉన్నారు. ఈ తరుణంలో ఆర్ధిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిందనే అంశం ఆందోళన కలిగించే పరిణామమే అంటున్నారు నిపుణులు.

Next Story
Share it