Telugu Gateway
Top Stories

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగింపు

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగింపు
X

అదే అనిశ్చితి. అదే నిషేధం. అలా కొన‌సాగుతూనే ఉంది. అస‌లు అంత‌ర్జాతీయ వాణిజ్య విమాన స‌ర్వీసులు ఎప్పుడు మొద‌ల‌వుతాయో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. క‌రోనా త‌గ్గుతున్న‌ట్లే త‌గ్గుతోంది..మ‌ళ్ళీ విశ్వ‌రూపం చూపిస్తోంది. ఒక్కో వేరియంట్..ఒక‌ దేశం నుంచి మ‌రో దేశానికి అలా వెళుతూనే ఉంది. దీంతో మ‌ళ్లీ క‌రోనాకు ముందు ఉన్న సాధార‌ణ ప‌రిస్థితులు ఎప్ప‌టికి వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌ధ్య‌లో వ్యాక్సిన్ పాస్ పోర్టు ప్ర‌తిపాద‌న‌ తెర‌పైకి వ‌చ్చినా అది కార్య‌రూపం దాల్చ‌లేదు. కొన్ని దేశాలు మాత్రం రాబోయే రోజుల్లో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి అనుమ‌తించే అంశంపై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. తాజాగా భార‌త ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని ఆగ‌స్టు 31 వ‌ర‌కూ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు డీజీసీఏ తాజాగా ఓ స‌ర్కుల‌ర్ జారీ చేసింది.

జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్‌ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. కార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది. కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో క‌రోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2020 మార్చి 23 నుండి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను కేంద్రం నిలిపివేసింది.

Next Story
Share it