కొత్త వైరస్ కలకలం..బ్రిటన్ కు విమానాలు రద్దు
ఊహించని పరిణామం. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విమానయాన రంగానికి మరో షాక్. బ్రిటన్ లో పుట్టుకొచ్చిన కొత్త వైరస్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. దీంతో పలు దేశాలు వరస పెట్టి బ్రిటన్ నుంచి విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో భారత సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ లో కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రభుత్వం డిసెంబర్ 31 వరకూ బ్రిటన్ కు విమానాలు నిలిపివేసింది. అక్కడ నుంచి విమానాలు ఇక్కడకు రావు. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లవు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి రానుంది. అయితే ఈ లోపు బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే వారు ఖచ్చితగా ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. అత్యవసరంగా సోమవారం నాడు సమావేశం అయిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా దుబాయ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇఫ్పటికే పలు దేశాలు బ్రిటన్ కు సర్వీసులు నిలిపివేశాయి. భారత్ కూడా వేగంగా స్పందించింది. లేదంటే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు వైద్య నిపుణులు ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నా కూడా పలు దేశాలు ఏ మాత్రం రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేవు. బ్రిటన్ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.
బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం (డిసెంబర్ 21) ఆయన ట్వీట్ చేశారు. తక్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్‌లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి.