రామ్ దేవ్ బాబాపై వెయ్యి కోట్ల పరువు నష్టం దావా
యోగా గురు రామ్ దేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఝలక్ ఇచ్చింది. లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని..లేదంటే వెయ్యి కోట్ల రూపాయల నష్టపరిహారం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాఈ వివాదం సద్దుమణగలేదు. కొద్ది రోజుల క్రితం అల్లోపతి వైద్యంపై రామ్ దేవ్ బాబా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలపై ఐఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి హర్షవర్ధన్ కూడా బాబా వ్యాఖ్యలను తప్పుపట్టడమే కాకుండా వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది.
అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‌కు లేఖ రాసింది. రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. కరోనా సమయంలో డాక్టర్లపై..అల్లోపతి వైద్యంపై విమర్శలు చేయటాన్ని ఐఎంఏ తీవ్రంగా తప్పుపడుతోంది.