Telugu Gateway
Top Stories

నిద్రమత్తు వీడండి..లాకౌ డౌన్ పెట్టండి

నిద్రమత్తు వీడండి..లాకౌ డౌన్ పెట్టండి
X

ఐఎంఏ సంచలన వ్యాఖ్యలు

దేశంలో తక్షణమే లాక్ డౌన్ విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఇప్పటికైనా నిద్రమత్తు వీడి చర్యలకు దిగాలని సూచించింది. ఈ మేరకు ఘాటైన పదజాలతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. దేశాన్ని పీడిస్తున్న మహమ్మరి విషయంలో వైద్య శాఖ అత్యంత బద్దకంతో...నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మండిపడింది. వైద్య శాఖ నిర్ణయాలు ఏ మాత్రం సరిగాలేవని పేర్కొంది. రాష్ట్రాలు విధిస్తున్న లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూల వల్ల ఉపయోగం ఉండదని, దేశ వ్యాప్తంగా ఒకేసారి లాక్ డౌన్ విధించటం ద్వారా వైరస్ చైన్ కు బ్రేకులు వేయవచ్చని పేర్కొంది. కరోనా రెండవ దశ వేళ కేంద్ర వైద్య శాఖ వ్యవహరిస్తున్న తీరును తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొంది. తమ అసోసియేషన్ కేంద్రానికి ఇఛ్చిన సలహాలు, సూచనలను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్దమైన లాక్ డౌన్ అత్యవసరం అని పేర్కొన్నారు.

అధే సమయంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ తీరును కూడా ఐఎంఏ తప్పుపట్టింది. ఆక్సిజన్ కొరత కారణంగా వైద్యులు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ వల్లే మెడికల్ సిబ్బందికి కొంత ఊరట లభిస్తుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్న వేళ కేంద్రం లాక్ డౌన్ ను తిరస్కరించటం ఏ మాత్రం సరికాదన్నారు. రాబోయే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐఎంఏ సూచించింది. రకరకాల మ్యూటెంట్లు వచ్చినందున ఈ ముప్పు ఏ మేరకు ఉందనే విషయంలో స్పష్టత లేదని..ఈ సమస్యను అధిగమిచేందుకు వీటిపై పరిశోధన బాధ్యతను నిపుణులకు అప్పగించాలని సూచించింది.

Next Story
Share it