Telugu Gateway
Top Stories

ఐఐటి విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్లు

ఐఐటి విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్లు
X

ఐఐటి లో సీటు సాధించాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. మరి ఈ లక్ష్యం చేరుకోవటం కూడా అంత ఈజీ ఏమీ కూడా కాదు. దీనికి సరైన ప్లానింగ్ ఒక్కటే కాదు...ఎంతో కష్టపడాలి కూడా. ముంబై ఐఐటి వంటి చోట సీటు వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు టాప్ స్టూడెంట్స్ కిందే లెక్క. ఎందుకంటే అక్కడ ఐఐటి పూర్తి చేస్తే తర్వాత వచ్చే ఆఫర్ లు కూడా అలాగే ఉంటాయి. ముంబై ఐఐటి లో డిగ్రీ పూర్తి చేసిన వారు విదేశాల్లోని అగ్రశ్రేణి కంపెనీల సీఈఓ లుగా కూడా నియమితులు అవుతున్నారు. తాజాగా ముంబై ఐఐటి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలువడింది. ఈ విషయాన్నీ ముంబై ఐఐటి అధికారికంగా తెలిపింది. అదేంటి అంటే తాజాగా ఒక విద్యార్థికి ఏటా 3.7 కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజీ తో జాబ్ వచ్చింది అని తెలిపింది. ప్రతి ఏటా ఇలా ముంబై ఐఐటి విద్యార్థులకు వచ్చే ఆఫర్స్ మొత్తం కూడా పెరుగుతూ పోతోంది. తాజాగా వచ్చిన 3.7 కోట్ల రూపాయల ఆఫర్ ఒక విదేశీ కంపెనీ నుంచి వచ్చింది.

మరో విద్యార్థికి 1 .7 కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజీ తో ఆఫర్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఈ ఆఫర్స్ ను అంగీకరించినట్లు ఐఐటి వెల్లడించింది. అయితే వారి పేర్లను బహిర్గతం చేయలేదు. గత ఏడాది ఒక విద్యార్థికి 2.1 కోట్ల రూపాయల ప్యాకేజీ రాగా..ఇప్పుడు ఆ మొత్తం ఏకంగా 3.7 కోట్ల రూపాయల కు చేరటం హాట్ టాపిక్ గా మారింది. 2022 -2023 సంవత్సరంలో ప్రీ ప్లేస్ మెంట్స్ లో మొత్తం 300 మందికి ఆఫర్ లు రాగా...ఇందులో 194 ఆఫర్లను విద్యార్థులు అంగీకరించినట్లు ముంబై ఐఐటి వెల్లడించింది. ఇందులో 16 మందికి కోటి రూపాయల పైనే ప్యాకేజీ దక్కింది. ప్లేస్ మెంట్స్ లో 65 మందికి విదేశీ సంస్థల నుంచి ఆఫర్ లు వచ్చాయి. ఐఐటిలో విద్య పూర్తి చేసిన వారికి వచ్చే సగటు వేతనం కూడా ప్రతి ఏటా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం సగటు వేతన ప్యాకేజీ 21 .82 లక్షల రూపాయలుగా ఉంది. క్రితం ఏడాది 21 .50 లక్షల కంటే ఈ సారి కొంత మేర పెరుగుదల నమోదు అయింది

Next Story
Share it