ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్..మొబైల్ యాప్ లో సాంకేతిక సమస్యలు
దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ శుక్రవారం నాడు తన కస్టమర్లకు చుక్కలు చూపించింది. చాలా మంది వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ సేవలతోపాటు బ్యాంక్ మొబైల్ యాప్ వాడకం విషయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ ఫిర్యాదులపై బ్యాంక్ కూడా స్పందించింది. తాము సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
సాధ్యమైనంత వేగంగా సమస్యను పరిష్కరించి అప్ డేట్ ఇస్తామని పేర్కొంది. అయితే స్టాక్ మార్కెట్ నడిచే సమయంలో ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఓ ఖాతాదారు వ్యాఖ్యానించారు. గతంలో మరో ప్రైవేట్ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ప్రధానంగా తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో కొన్ని రోజులు పాటు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకును క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా ఆర్ బిఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.