'బూస్టర్ డోసు' తీసుకున్న జో బైడెన్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. కోవిడ్ నుంచి మరింత రక్షణకు ఇది తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్లకు బూస్టర్ డోసు తీసుకోవటం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే మూడవ డోస్ తీసుకున్నానని..అర్హులైన అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని బైడెన్ సూచించారు. ఫైజర్ వ్యాక్సిన్ ను ఆయన తీసుకున్నారు.వ్యాక్సిన్లు వచ్చిన సమయంలోనే బూస్టర్ డోస్ పై చర్చ ప్రారంభం అయింది. అయితే దీనిపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆరోగ్యంగా ఉన్న వారికి ఎలాంటి బూస్టర్ డోస్ అవసరం లేదని చెబుతున్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారు..అధిక రిస్క్ ఉన్న వారు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్నిమరికొంత మంది వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో మాత్రం బూస్టర్ డోసు పై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అయితే కొంత మంది అనధికారికంగా వ్యాక్సిన్ మిక్సింగ్ డోసులు కూడా తీసుకుంటున్నారు. తమకు తెలిసిన డాక్టర్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు చాలా మంది.