లిస్టింగ్ రోజే ఒక్కో షేర్ పై వంద రూపాయల నష్టం
ఊహించిందే జరిగింది. అతి పెద్ద ఐపీవో ద్వారా చరిత్ర సృష్టించిన హ్యుండయ్ ఇండియా మోటార్ ఐపీవో ఆఫర్ ధర కంటే తక్కువకే నమోదు అయింది. హ్యుండయ్ మోటార్ ఒక్కో షేర్ ను 1960 రూపాయలకు జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హ్యుండయ్ మోటార్ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం(జీఎంపీ) తగ్గుతూ రావటంతో హ్యుండయ్ మోటార్ లిస్టింగ్ ధరపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. లిస్టింగ్ కు ఒక రోజు ముందు అంటే సోమవారం నాడు జీఎంపీ పెరగటంతో హ్యుండయ్ షేర్లు 2035 రూపాయల వద్ద లిస్ట్ కావచ్చు అనే అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ ఎక్కువ మంది చెప్పినట్లు ఈ షేర్లు ఆఫర్ ధర కంటే దిగువన 1934 రూపాయల వద్ద నమోదు అయ్యాయి. ఈ లెక్కన చూస్తే ఒక్క షేర్ పై 26 రూపాయల నష్టం వచ్చినట్లు లెక్క. గతంలో వచ్చిన అతి పెద్ద ఐపీవో లు అయిన ఎల్ఐసి తో పాటు పేటిఎం, రిలయన్స్ పవర్ వంటి ఇష్యూలతో ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అతి పెద్ద ఇష్యూగా వచ్చిన హ్యుండయ్ మోటార్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అతి పెద్ద ఐపీవో అంటే ఇన్వెస్టర్లకు లిస్టింగ్ లాభాలు ఇవ్వదు అనే అభిప్రాయం మరో సారి కొనసాగినట్లు అయింది. హ్యుండయ్ మోటార్ తన ఐపీవో ద్వారా అక్టోబర్ 15 నుంచి 17 మధ్య కాలంలో దేశీయ మార్కెట్ నుంచి 27870 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు ఈ కంపెనీ షేర్లు అటు బిఎస్ఈతో పాటు ఎన్ఎస్ఈ లో లిస్ట్ అయ్యాయి. మంగళవారం ఉందయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో హ్యుండయ్ షేర్లు ఆఫర్ ధర కంటే వంద రూపాయల నష్టంతో 1860 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన హ్యుండయ్ మోటార్ ఇండియా ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిలిచింది. అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం దీర్ఘకాలంలో హ్యుండయ్ షేర్లు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నాయి. అయితే ఈ లిస్టింగ్ దెబ్బ చూసిన తర్వాత కొంత కాలం ఇన్వెస్టర్లు పెద్ద ఇష్యూల జోలికి పోరు అనే చెప్పొచ్చు.