Telugu Gateway
Top Stories

అతి పెద్ద ఐపీఓ కి అంతా సిద్దం

అతి పెద్ద ఐపీఓ కి అంతా సిద్దం
X

హ్యుండయ్ మోటార్ ఇండియా మెగా ఐపీఓ మంగళవారం (అక్టోబర్ 15 న ) ప్రారంభం కాబోతోంది. దేశంలో అతి పెద్ద ఐపీఓ ఇదే. ఇప్పటి వరకు ఎల్ఐసి పేరున ఉన్న ఆ రికార్డు ను ఇప్పుడు హ్యుండయ్ మోటార్ బ్రేక్ చేయబోతుంది. గత కొంత కాలంగా దేశంలో ఐపీఓలు వరస పెట్టి సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. చాలా ఐపీఓ లు లిస్టింగ్ సమయంలోనే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ కూడా ఇచ్చాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మెగా ఐపీఓలు చాలా వాటి విషయంలో మదుపరులకు చేదు అనుభవాలే మిగిలాయి అని చెప్పొచ్చు. ఇందులో ప్రధానమైనది పేటిఎం ఒకటి అయితే...రిలయన్స్ పవర్ మరొకటి. ఎల్ఐసి కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. ఈ సంస్థ కూడా మదుపరులకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. పైగా చాలా రోజులపాటు ఆఫర్ ధర కంటే దిగువనే ఎల్ఐసి షేర్లు ట్రేడ్ అయ్యాయి. హ్యుండయ్ మెగా ఐపీఓ ప్రారంభం అయ్యే ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) మూడు శాతానికి తగ్గటం కీలక పరిణామంగా మారింది.

దీంతో ఈ ఇష్యూ కి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. పలు బ్రోకరేజ్ సంస్థలు హ్యుండయ్ షేర్లకు దరఖాస్తు చేయమని సూచిస్తున్నా కూడా దీర్ఘకాలిక లక్ష్యంతోనే అప్లై చేయమని చెపుతున్నారు. అంటే ఇతర కంపెనీల తరహాలో హ్యుండయ్ నుంచి లిస్టింగ్ లో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఉండే అవకాశం ఉండదు అనే సంకేతాలు ఇస్తున్నట్లు అయింది. దీనికి తోడు జీఎంపీ పడిపోవటం కూడా ఇదే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. హ్యుండయ్ మోటార్ నిర్ణయించిన గరిష్ట ధర 1960 రూపాయల ప్రకారం చూస్తే ..కేవలం 60 రూపాయల ప్రీమియంతోనే ఇవి ప్రస్తుతం గ్రే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి.

రెండు వారాల క్రితం 570 రూపాయలు ఉన్న జీఎంపీ ఇప్పడు అరవై రూపాయలకు తగ్గినట్లు ఫైనాన్సియల్ డైలీ లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది లాంగ్ టర్మ్ కోణంలో అయితే తప్ప...లిస్టింగ్ లో పెద్ద ఎత్తున లాభాలు ఆశించే వాళ్ళు ఇటు చూడకపోవటమే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు హ్యుండయ్ ఇండియా అతి పెద్ద అంటే 27,870 రూపాయల పరిమాణంతో కూడిన ఐపీఓ ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి. అక్టోబర్ 15 న ప్రారంభం అయ్యే ఈ ఇష్యూ 17 న ముగియనుంది. హ్యుండయ్ ఐపీఓ తో మార్కెట్ లో లిక్విడిటీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క కంపెనీ ప్రమోటర్ల చేతికి ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు పోతుండటమే దీనికి కారణంగా చెపుతున్నారు.

Next Story
Share it