అక్టోబర్ 22 న హ్యుండయ్ షేర్ల లిస్టింగ్
హ్యుండయ్ మోటార్ ఇండియా అతి పెద్ద ఐపీఓ అతి కష్టం మీద సబ్ స్క్రైబ్ అయింది. అక్టోబర్ 15 న ఈ ఇష్యూ ప్రారంభం కాగా....17 సాయంత్రం ముగిసింది. తొలి రెండు రోజులు టెన్షన్ పెట్టిన ఈ మెగా ఇష్యూ ఎట్టకేలకు బయటపడింది అనే చెప్పాలి. మొత్తం మీద హ్యుండయ్ మోటార్ ఐపీఓ 2 .37 రేట్ల మేరకు సబ్ స్క్రైబ్ అయింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ మాత్రం 50 శాతం పైనే సబ్ స్క్రైబ్ అయింది. దీంతో ఈ కేటగిరీ లో దరఖాస్తు చేసిన వారు అందరికి షేర్స్ అలాట్ అవటం ఖాయం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు దేశంలో అతి పెద్ద ఐపీఓ ఇదే. ఇప్పటి వరకు ఎల్ఐసి పేరు మీద ఉన్న అతి పెద్ద ఐపీఓ రికార్డు ను ఇప్పుడు హ్యుండయ్ మోటార్ దక్కించుకుంది. ఈ ఇష్యూ ద్వారా దక్షిణ కొరియా కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 27870 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద జారీ చేసిన షేర్లు కావటంతో ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం పేరెంట్ కంపెనీకి వెళతాయి తప్ప...హ్యుండయ్ మోటార్ ఇండియా చేతికి ఏమీ రావు. ఇది కూడా ఇన్వెస్టర్ల లో ఆసక్తి తగ్గటానికి ఒక కారణంగా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు ఐపీఓ వచ్చింది అంటే చాలు...ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తూ వచ్చారు. కానీ గత కొన్నిరోజులుగా మార్కెట్ లు పతనం అవటం ఒకటి..ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇన్వెంటరీలు పెరగటం...ఈ పండగా సీజన్ లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవటం వంటి అంశాలు కూడా ఈ ఇష్యూపై ప్రభావం చూపించాయి. హ్యుండయ్ మోటార్ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) చూస్తే లిస్టింగ్ లో ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించటం లేదు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే...ఆఫర్ ధర కంటే తక్కువకే హ్యుండయ్ షేర్లు లిస్ట్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే దీర్ఘకాలంలో మాత్రం ఈ షేర్లు మంచి ప్రతిఫలం ఇచ్చే అవకాశం ఉంది అని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అన్నీ రికమండ్ చేశాయి. హ్యుండయ్ మోటార్ షేర్ల కేటాయింపు అక్టోబర్ 18 న పూర్తి అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22 న ఈ షేర్లు ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో లిస్ట్ కానున్నాయి.