Telugu Gateway
Top Stories

రాజకీయ లింకులే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు శాపమా?!

రాజకీయ లింకులే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు శాపమా?!
X

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా ఐటి కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. దిగ్గజ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరో వైపు మాంద్యం భయం, ఇవి మార్కెట్ కు సంబంధం లేని అంశాలు. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో జరిగే ప్రీ లాంచ్ మోసాలు...ఐటి దాడులు.హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కలకలం రేపుతున్నాయి. వరసపెట్టి ప్రీ లాంచ్ వెంచర్ల మోసాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత సాహితి ఇన్ఫ్రా, తర్వాత జయత్రి ఇన్ఫ్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఇంకా బయటకు రానివి ఎన్నో. బయటకు వచ్చిన వాటిలోనే సొంత ఇంటి కల నిజం చేసుకుందామని వందల కోట్ల రూపాయలు పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితిలో వేల మంది ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఖరీదైన ప్రాంతాల్లో రిచ్ లుక్ ఆఫీస్ లు తెరవటం, కళ్ళు చెదిరే బ్రోచర్లు,,,సేల్స్ టీం అంతా మాములే. ప్రీ లాంచ్ మోసాలు ఎప్పటినుంచో ఉన్నా ఎప్పటికప్పుడు కొత్త వెంచర్లు వస్తున్నాయి...ప్రజలు కూడా వీటి బారిన పడుతూనే ఉన్నారు. ఇది ఒకెత్తు అయితే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కీలక రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వరసపెట్టి సాగుతున్న ఐటి దాడులు కూడా కొనుగోలు దారుల్లో కలకలం రేపుతోంది.

ఇది కేవలం పన్ను చెల్లింపుల్లో తేడా వరకు అయితే పెద్దగా కొనుగొలు దారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ దాడులు అన్ని రాజకీయాలతో ముడిపడి ఉండటమే ఎక్కువ మందికి ఆందోళన కలిగిస్తున్న అంశం, తెలంగాణ ప్రభుత్వం తో సన్నిహితంగా ఉన్న బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు నేరుగా అధికార పార్టీ తో సంబంధం ఉన్న కంపెనీలు ఐటి దాడులను ఎదుర్కొంటున్నాయి. ఇదే ఎక్కువమందిలో కలకలం రేపటానికి కారణం అవుతోంది. గతంలో వాసవి తో పాటు సుమధుర, హానర్, ఫీనిక్స్, వంశీరామ్ బిల్డర్స్ వంటి సంస్థలపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కెసిఆర్ సన్నిహితుడుగా పేరున్న వెంకటరామిరెడ్డి తో పాటు అయన కుటుంబ సభ్యులకు చెందిన రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ తో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్, వసుధ ఫార్మా పై కూడా ఐ టి దాడులు జరిగాయి. ఇది కూడా పొలిటికల్ లింక్ ల కోణంలోనే సాగింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలు అన్ని ఎటు దారితీస్తోయో అన్న టెన్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉంది. అయితే హైదరాబాద్ లో ఇన్వెంటరీ సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే పరిణామమే అని చెప్పొచ్చు.

Next Story
Share it