Telugu Gateway
Top Stories

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ కు అన్నీ అప‌శ‌కున‌ములే!

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ కు అన్నీ అప‌శ‌కున‌ములే!
X

అమెరికా..ఐటి రంగం..హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ అన్నీ ఒక‌దానికి ఒక‌టి అనుసంధానం అయి ఉన్నఅంశాలు . అటు అమెరికాలో తేడా వ‌చ్చినా..ఇటు ఐటి రంగంలో తేడా వ‌చ్చినా ఆ ప్ర‌భావం ఖ‌చ్చితంగా హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ప‌డుతుంది. ఈ మ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ కు అన్నీ అప‌శ‌కున‌ములే ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు పేరుకుపోతున్న అమ్ముడుకాని యూనిట్లు. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా ఐటి రంగం వ‌ద్ధి రేటు త‌గ్గే ఛాన్స్ ఉంద‌నే రేటింగ్ ఏజెన్సీల అంచ‌నాలు. ఇప్పుడు అమెరికాలో మాంద్యం భ‌యాలు. వ‌ర‌స‌గా రెండ‌వ సారి అంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ 0.9 శాతం త‌గ్గింది. జ‌న‌వ‌రి-మార్చిలోనూ ఇది 1.6 శాతం మేర ప‌త‌నం అయింది. వ‌ర‌స‌గా రెండు త్రైమాసికాలు అమెరికా జీడీపీ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం అంటే ఇది మాంద్యానికి సంకేతం అని కొంత మంది ఆర్ధిక‌వేత్త‌లు చెబుతుంటే..ఇది ఏమాత్రం స‌రికాద‌ని అమెరికా ఫెడ్ ఛైర్మ‌న్ జెరోమ్ పావెల్ తేల్చిచెబుతున్నారు.

నిరుద్యోగ రేటు 3.6 శాతానికి త‌గ్గింది అంటే ఇది ఎంత మాత్రం మాంద్యానికి దారితీసే ఛాన్స్ లేద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఏది ఏమైనా వ‌ర‌స‌గా రెండు త్రైమాసికాలు అగ్ర‌రాజ్యం అమెరికా జీడీపీ త‌గ్గుతూ వ‌స్తున్నందున ఎన్ ఆర్ ఐలు..ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు కొత్త పెట్టుబ‌డుల‌పై ఆచితూచి వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు..అమెరికాలో ద్ర‌వ్యోల్బ‌ణం 40 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకోవ‌టంతో ఫెడ్ వ‌డ్డీ రేట్లు పెంచుతూ పోతుంది. దీంతో అక్క‌డ తొలిసారి జీవ‌న వ్య‌యం పెరిగిన సెగ‌ను ప్ర‌జ‌లు చ‌విచూస్తున్నారు. ఇలా ఓవ‌రాల్ గా చూసుకుంటే మాంద్యం భ‌యం పోవ‌టానికి.పెరిగిన వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌టానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నందున ఎన్ ఆర్ఐలు ఎవ‌రూ తొంద‌ర‌ప‌డి కొత్త పెట్టుబ‌డుల విష‌యంలో ముందుకు వెళ్ళ‌ర‌ని..ఇది ఖ‌చ్చితంగా హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్ర‌భావం చూపించే అంశ‌మే అని ఈ రంగంలోని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Next Story
Share it