Telugu Gateway
Top Stories

నౌకలపై ఇరాన్ దాడి

నౌకలపై ఇరాన్ దాడి
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా చేస్తారు అని మరో సారి నిరూపించుకున్నారు. ఇరాన్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే ప్రెనే లేదు అని చివరి నిమిషం వరకు చెప్పుకుంటూ వచ్చిన ఆయన పాకిస్థాన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే హర్ముజ్ జలసంధి విషయంలో తమ దిగ్బంధనం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగించటం ద్వారా ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకోవాలనే కోణంలో అమెరికా ఈ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అయితే ఇరాన్ కూడా అంతే ధీటుగా హర్ముజ్ జలసంధి లో అమెరికా నౌకలను అడ్డుకోవటం ఆపేస్తేనే తదుపరి చర్చలు అంటూ స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు హర్ముజ్ జలసంధే ఇప్పుడు హాట్ స్పాట్ గా మారింది. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు దిగుతోంది.

కొన్ని నౌకలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసి ) ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటి అమెరికా, ఇరాన్ బృందాల మద్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్ చర్చలకు ఏ మాత్రం ఆసక్తి చూపకపోవటంతో అమెరికా కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చల కోసం ఇస్లామాబాద్ బయలుదేరి కూడా తన పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ పొడిగింపుతో వెంటనే చర్చల అవసరం కూడా తగ్గింది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఇరాన్ ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయి అన్నది కొద్దీ రోజులు పోతే కానీ తేలదు.

Next Story
Share it