Telugu Gateway
Top Stories

అదానీ గ్రూప్ షేర్లు అన్ని లాభాల్లోనే

అదానీ గ్రూప్ షేర్లు అన్ని లాభాల్లోనే
X

దేశంలో ఏ కార్పొరేట్ కంపెనీ ఎదగనంత వేగంగా అదానీ గ్రూప్ వివిధ రంగాల్లో విస్తరించింది. దీని వెనక కారణాలు ఎన్నో. ముఖ్యం గా అదానీ గ్రూప్ కు ప్రధాని మోడీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ, అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఎన్నో సార్లు విమర్శలు చేశాయి. నియంత్రణా సంస్థలకు ఫిర్యాదు లు చేశాయి. కానీ అవేమి అదానీ గ్రూప్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. కానీ అమెరికా కు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ దేశీయ స్టాక్ మార్కెట్ల లో కలకలం రేపింది. సరిగ్గా రెండేళ్ల క్రితం అదానీ గ్రూప్ పై వెల్లడించిన నివేదికతో ఆ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు అదానీ గ్రూప్ పలు అక్రమాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు విదేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అవినీతి సొమ్మును కంపెనీల్లోకి బదలాయించింది అని పేర్కొంది.

అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. తొలుత 2023 జనవరి లో హిండెన్ బర్గ్ రీసెర్చ్ తన నివేదికను బహిర్గతం చేసింది. తర్వాత కూడా మరో సారి అదానీ గ్రూప్ తో పాటు సెబీ చైర్ పర్సన్ మాదబీపూరి బుచ్ పై కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్ తో పాటు అదానీ గ్రూప్ లో కలకలం రేపిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు మూతపడుతోంది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ వెల్లడించారు. ఈ మేరకు అయన ఒక సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. హిండెన్ బర్గ్ ఒక్క అదానీ గ్రూప్ పైనే కాదు..అమెరికాలోని పలు దిగ్గజ కంపెనీల విషయంలో కూడా ఇదే మోడల్ ను అనుసరించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కు సంబంధించి తాము ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు పూర్తి కావటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనక ఎలాంటి బెరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవు అన్నారు. గతంలో తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నాను అని..ఇప్పుడు తాను కంఫర్ట్ జోన్ లో ఉన్నట్లు నాథన్ ఆండర్సన్ తెలిపారు.

హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో జీవితానికి సరిపడా సాహసం చేశాను అని...అయితే జీవితంలో ఇది ఒక అధ్యాయం మాత్రమే అన్నారు. హిండెన్ బర్గ్ మూసివేసినందున...ఇక తన భవిష్యత్ కార్యక్రమంపై దృష్టి పెడతానని తెలిపారు. ఇది ఇలా ఉంటే తమపై తప్పుడు నివేదికలు ఇచ్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై చర్యలు తీసుకుంటామని ఈ నివేదికలు బహిర్గతం అయిన సమయంలో అదానీ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసినా కూడా ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి కొన్ని రోజుల్లోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ మూత వార్త వెలువడటం కూడా కీలక పరిణామంగా చెపుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వార్తతో ఎక్కువ సంతోషించింది గౌతమ్ అదానీ అయి ఉంటారు అనే చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ వార్త వెలువడిన తర్వాత గురువారం నాడు స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్లు అన్ని మంచి లాభాలు గడించాయి కూడా.

Next Story
Share it