Telugu Gateway
Top Stories

సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలు..మార్కెట్స్ రియాక్షన్!

సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలు..మార్కెట్స్ రియాక్షన్!
X

ఉదయం టీజర్ . సాయంత్రానికే సినిమా విడుదల. ఇది అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తీరు. ఈ సారి హిండెన్ బర్గ్ ఏకంగా స్టాక్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మాధబి పూరి బచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. 2023 లో మొదటిసారి హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసినప్పుడు అటు కేంద్రంతో పాటు ఇటు సెబీ స్పందించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ హిండెన్ బర్గ్ ఏకంగా సెబీ చీఫ్ పై సంచలన ఆరోపణలు చేయటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. అయితే హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు నిరూపితం అవుతాయా లేదా అన్నది తేలాలంటే కొంత సమయం పడుతుంది. కానీ అటు ఇన్వెస్టర్లతో పాటు కార్పొరేట్ వర్గాల్లో పలు అనుమానాలు కల్పించటానికి మాత్రం హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా బయటపెట్టిన వివరాలు మాత్రం కీలకం అవుతాయి అనే చెప్పాలి.

అదానీ గ్రూప్ సంస్థల షేర్లను కృత్రిమంగా పెంచటానికి ఉపయోగించిన మారిషస్ ఫండ్స్ లో సెబీ చీఫ్ మాధబి పూరి బచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ కు చెందిన మారిషస్ తో పాటు ఇతర ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏ మాత్రం ఆసక్తి చూపకపోవటం వెనక గల కారణాలు ఇప్పుడు బయటపడ్డాయని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ గ్రూప్ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు నిర్వహించటం అందరూ చూశారన్నారు. విజిల్ బ్లోయర్ పత్రాల ప్రకారం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న ఆఫ్ షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో మాధబి పూరి బచ్, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. వీరిద్దరి వాటాల విలువ భారతీయ కరెన్సీ లో 83 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని పేర్కొంది.

ఈ ఆరోపణలపై సెబీ చీఫ్ మాధబి పూరి తో పాటు అదానీ గ్రూప్ కూడా స్పందించింది. హిండెన్ బర్గ్ కు షో కాజ్ నోటీసు లు ఇచ్చినందునే వ్యక్తిత్వహననానికి పాల్పడుతుంది అని ఆమె పేర్కొన్నారు. తాను సెబీ చీఫ్ గా రాకముందు నుంచి తన లావాదేవీలు అన్ని బహిర్గతం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. రాబోయే రోజుల్లో తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించటానికి కూడా సిద్ధం అని తెలిపారు. అదానీ గ్రూప్ కూడా హిండెన్ బర్గ్ ఆరోపణలపై స్పందిస్తూ ఇవన్నీ కుట్రపూరితంగా చేసినవే అని పేర్కొంది. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ వాటాదారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపించింది. హిండెన్ బర్గ్ ఆరోపణలను అటు సెబీ చీఫ్, ఇటు అదానీ గ్రూప్ ఖండిస్తున్నా కూడా సోమవారం నాడు మార్కెట్ లు ఈ విషయంపై ఎలా స్పందిస్తాయి అన్న విషయం మార్కెట్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Next Story
Share it