షహరన్ పూర్ నుంచి హిమాలయాల మేజిక్
అద్భుతమైన హిమాలయాల అందాలు చూడాలి అని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అంతే కాదు..దేశ వ్యాప్తంగా పలు కీలక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు అవుతోంది. దీంతో చాలా చోట్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు తుఫాన్ వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో మరోసారి అద్భుతం ఆవిష్కృతం అయింది. గత ఏడాది లాగానే ఈ సారి కూడా హిమాలయాలు రెండు వందల కిలోమీటర్ల దూరానికి కూడా ఇలా కన్పించి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని షహరన్ పూర్ నుంచి హిమాలయాలు కన్పించాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితమే ఇలా కన్పించేవి. కరోనా కారణంగా ఇప్పుడు మరోసారి చూపరులకు ఈ ఛాన్స్ దక్కింది. మామూలుగా అయితే కాలుష్యం కారణంగా ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కరోనా సృష్టిస్తున్న విలయం ఒకెత్తు అయితే.. లాక్ డౌన్ ల వల్ల ప్రకృతికి మాత్రం ఒకింత మేలు జరుగుతోంది. పలువురు అధికారులు కూడా హిమాలయాలకు చెందిన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.