వెయ్యి కోట్ల రూపాయల దొంగ లెక్కలు చూపించిన హీరో మోటో కార్ప్!
హీరో మోటో కార్ప్ పై ఇటీవల ఐటి శాఖ భారీ ఎత్తున దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇవి అత్యంత రొటీన్ గా సాగే వ్యవహారంగా కంపెనీ అప్పట్లో తేల్చిపారేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఐటి శాఖ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అవేంటి అంటే హీరో మోటో కార్ప్ ఛైర్మన్ అండ్ ఎండీ పవన్ ముంజాల్ ఢిల్లీకి సమీపంలో ఫాంహౌస్ కొనుగోలుకు వంద కోట్ల రూపాయల మేర బ్లాక్ మనీ చెల్లించినట్లు గుర్తించారు. దీంతోపాటు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు గుర్తించారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై అటు ఐటి అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఐటి దాడుల్లో భారీ ఎత్తున బోగస్ వ్యయాలు చూపించినట్లు వార్తలు వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మంగళవారం నాడు ఏకంగా 168 రూపాయల నష్టంతో 2208 రూపాయల వద్ద ముగిసింది. ఓ దశలో ఏకంగా 2155 రూపాయల కనిష్ట స్థాయికి కూడా పతనం అయింది. మార్చి 23-26 తేదీల మధ్య హీరో మోటో కార్ప్ ఆఫీసులతోపాటు ఎండీ నివాసంలోనూ దాడులు జరిగాయి. అయితే వెయ్యి కోట్ల రూపాయల బోగస్ వ్యయాల వార్తలను వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఐటి శాఖ తన ఆధారాల నమోదును పూర్తి చేస్తే ఆ వివరాలను ఎక్స్చేంజ్ లకు ఇస్తామని తెలిపింది.