వెయ్యేళ్ళలో చూడని వర్షం..కార్లు కొట్టుకుపోయాయ్
కార్లు రోడ్డు మీద పరుగెడతాయి. కానీ అక్కడ మాత్రం కార్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల దెబ్బకు ఊహించని స్థాయిలో వరద రావటంతో వందల కొద్దీ కార్లు అలా నీళ్లలో రోడ్ల మీదకు వచ్చాయి. వెయ్యేళ్ళలో ఎప్పుడూ పడనంత వర్షం ఇప్పుడు పడిందని చెబుతున్నారు. ఇది ఎక్కడ అంటారా?. ప్రపంచాన్ని కరోనా వైరస్ తో వణికించిన చైనాలో. అక్కడి హెనన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో ఇళ్లు కూడా ముగినిపోయాయి. భీకర వరదతో పరిస్థితి అస్తవ్యస్తం అయింది. చైనాలో అతి పెద్ద ఐఫోన్ల తయారీ పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అంతే కాదు పారిశ్రామిక సంస్థలతోపాటు వాణిజ్య కార్యకలాపాలకు ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది.
ఈ ప్రాంతంలో ఉన్న నదులు..చెరువులు భారీ వరదలతో నిండిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ పడలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో చాలా దేశాల్లో కూడా ఇలా ఊహించని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. అంతే కాదు ఆ ప్రాంతంలో రైళ్లలో కూడా నీరు ప్రవేశించటంతో వారంతా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఈ భారీ వర్షాలను లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు.