మా నాన్నను కాల్చి చంపారు
ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. తనపై కేసు పెట్టి జైలుకు పంపారనే కారణంతో నిందిడుతు కాల్పులకు తెగబడి ఓ వ్యక్తి మరణానికి కారణం అయ్యాడు. గతంలో దేశ వ్యాప్తంగా మారుమోగిన హత్రాస్ లోనే ఈ దారుణం జరిగింది. లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తి, బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన వైనం కలకలం సృష్టించింది. హత్రాస్ పోలీస్ చీఫ్ వినీత్ జైస్వాల్ వెల్లడడించిన సమాచారం ప్రకారం మరణించిన వ్యక్తి, నిందితుడు గౌరవ్ శర్మపై 2018 జూలైలో వేధింపుల కేసు పెట్టాడు. ఈ కేసులో శిక్ష పడిన అతనికి స్థానిక కోర్టు బెయిల్‌మంజూరుచేయడంతో గ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య అంతర్గతంగా వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గౌరవ్ శర్మ భార్య, అత్త దేవాలయానికి వెళ్లారు. అదే సమయంలో బాధితుడి ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చారు.
ఈ సందర్బంగా వారి మధ్య వివాదం రగిలింది. అది కాస్తా పెద్దది కావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గౌరవ్ శర్మ కోపంతో రగిలిపోయాడు. తన అనుయాయులను పిలిపించుకొని గౌరవ్ బాధితుడిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. గతంలో తనపై వేధింపులకు పాల్పడిన అతడిని జైలుకు పంపించామన్న అక్కసుతోనే తన తండ్రిని కాల్చిచంపాడని బాధితుడి కుమార్తె కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు.