షాకింగ్ న్యూస్..కోవ్యాక్సిన్ డోస్ తీసుకున్న మంత్రికి కరోనా
షాకింగ్ న్యూస్. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్ కరోనా బారిన పడ్డారు. ఈ వార్త పెద్ద దుమారమే రేపుతోంది. మూడవ దశ ప్రయోగాలకు సంబంధించిన డోస్ ను ఈ మంత్రి తీసుకున్నారు. దీంతో కోవాక్సిన్ సమర్థతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడవ దశ ట్రయల్ డోస్ తీసుకున్న మంత్రి కరోనా బారిన పడకూడదు కానీ..ఆయన డోస్ తీసుకున్నాక కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారంటే వ్యాక్సిన్ల సమర్ధతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
అనిల్ విజ్ హర్యానా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. నవంబర్ 20న ఆయన ఈ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం అంబాలా కాంట్ లోని సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు అనిల్ విజ్ తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నవంబర్ 20న ఇదే ఆసుపత్రిలో విజ్‌కు కోవిడ్-19 టీకా ''కోవాక్సిన్'' ఇచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది.