Telugu Gateway
Top Stories

రెండు విమానాల్లో అనుచిత ఘటనలు

రెండు విమానాల్లో అనుచిత ఘటనలు
X

విమానాల్లో వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో సారి విమాన సిబ్బందిపై..లేదంటే తోటి ప్రయాణికులపైనే వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి. వేధింపుల విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు అన్నట్లు ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభ కూడా వీరి బారిన పడ్డారు. ఆమెకు ఎయిర్ ఇండియా విమానంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. విమాన ప్రయాణంలో ఆమె పక్కనే కూర్చున్న ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. ముంబై నుంచి కొచ్చికి ఎయిర్‌ ఇండియా విమానంలో నటి దివ్య ప్రభ ప్రయాణించారు. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టా ఖాతాలో వివరాలు షేర్ చేశారు. ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఏఐ 681లో ముంబై నుంచి కొచ్చికి వెళ్లే సమయంలో విమానంలో తాను ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు వేధించాడు అని... అసభ్యంగా ప్రవర్తించాడు అని వెల్లడించారు. దీనిపై ఎయిర్‌ హోస్టెస్‌కి ఫిర్యాదు చేయగా.. వాళ్ళు తీసుకున్న ఏకైక చర్య తన సీటు మార్చడం మాత్రమే అని పేర్కొన్నారు. అది కూడా టేకాఫ్‌కు ముందు తనకు వేరే సీటు కేటాయించారు అని తెలిపారు. కొచ్చికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్‌ అధికారులకు తెలిపితే వాళ్ళు తనను పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు వెళ్లమని చెప్పారన్నారు.

కేరళ పోలీసులకు నేను అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాను. ఈ విషయమై దర్యాప్తు చేయాలని వారిని అభ్యర్ధిస్తున్నానంటూ’ నటి దివ్య పోలీసులకు ఈ మెయిల్‌ ద్వారా పంపిన ఫిర్యాదు వివరాల స్క్రీన్‌ షాట్‌ను కూడా తన పోస్టుకు జోడించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని..అదే సమయంలో తప్పు గా ప్రవర్తించే వాళ్లపై సరైన చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు. ఇది ఇలా ఉంటే పూణే నుంచి నాగపూర్ వెళ్లే విమానంలో కూడా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఫిరోజ్ షేక్ అనే ఇంజనీర్ తన పక్కనే ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు రకరకాల సైగలు చేసి ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. బాధిత మహిళా విమానం ల్యాండ్ అయిన తర్వాత పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారు. వచ్చే నెలలో పెళ్లి పెట్టుకుని ఫిరోజ్ షేక్ విమానంలో అనుచితంగా ప్రవర్తించి జైలు పలు అయ్యాడు.

Next Story
Share it