Telugu Gateway
Top Stories

జీక్యూజీ పార్టనర్స్ వాటా కొనుగోలు ఎజెండా ఏంటో!

జీక్యూజీ పార్టనర్స్ వాటా కొనుగోలు ఎజెండా ఏంటో!
X

అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకువచ్చినప్పుడు అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ కష్టకాలంలో ఉన్న సమయంలో అమెరికా కు చెందిన జీక్యూజీ పార్టనర్స్ ఆ గ్రూప్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి అదానీ గ్రూప్ ను ఆదుకుంది. ఇన్వెస్టర్లు అందరూ అదానీ గ్రూప్ షేర్లు అమ్ముతున్న వేళ జీక్యూజీ పార్టనర్స్ వేల కోట్ల రూపాయలు ఈ గ్రూప్ లో పెట్టుబడి పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయినా... పెట్టిన పెట్టుబడికి జీక్యూజీ పార్టనర్స్ సాధించిన ప్రతిఫలం ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తే భారీగా ఉంది. ఒక వైపు అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన జీక్యూజీ పార్టనర్స్ తాజాగా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ లో భారీ పెట్టుబడులు పెట్టడటం హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు అదానీ గ్రూప్ లో..మరో వైపు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లో పెట్టుబడి పెట్టడం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. శుక్రవారం నాడు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్ ధర ఒక దశలో బీఎస్ఈలో 70.22 రూపాలకు చేరింది. కానీ చివరకు ఏడు రూపాయలకు పైగా లాభంతో 68 .89 రూపాయల వద్ద ముగిసింది. ఒక్క బీఎస్ఈ లోనే బల్క్ డీల్స్ ద్వారా 86 .28 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. జీక్యూజీ పార్టనర్స్ జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లో దగ్గర దగ్గర ఐదు శాతం వాటా కొనుగోలు చేసినట్లు తేలింది.

గత పద్నాలుగు సంవత్సరాల్లో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్ 70 రూపాయలు దాటడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. గత మూడేళ్ళలో జీఎంఆర్ ఇన్వెస్టర్లకు 77 శాతం రిటర్న్స్ వచ్చినట్లు మార్కెట్ గణాంకాలు చెపుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది అని చెపుతున్నాయి. గత కొంతకాలంగా దేశీయ ప్రయాణికులతో,అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో మంచి వృద్ధి నమోదు అవుతోంది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ చేతిలో భారత్ లో అత్యంత రద్దీ విమానాశ్రయం అయిన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, హైదరాబాద్, గోవా ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో జీఎంఆర్ కొత్తగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తోంది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లోకి జీక్యూజీ పార్టనర్స్ ఎంట్రీ కేవలం లాభాల కోసమా..లేక మరెవరి కోసం అయినా ఈ కొనుగోళ్లు చేశారా అనే సందేహాలు ఎక్కువ మందిలో ఉన్నాయి.

Next Story
Share it