Telugu Gateway
Top Stories

ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ

ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ
X

ఈ నవ్వులో రెండు కోణాలు. ఒకటి. ఎవరు ఎంత గోల చేసినా తనకు ఏమి కాదు అని చెప్పటం. రెండవది తిరిగి ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి సంపదలో ఆయనకంటే ముందుకు వచ్చాను చూసుకోండి అనే విజయ గర్వం అయి ఉండొచ్చు. కొత్త ఏడాది ప్రారంభం నుంచే అదానీ గ్రూప్ దూకుడు పెరిగింది. గత ఏడాది ఎన్నడూలేని రీతిలో గడ్డుకాలాన్ని చవిచూసిన అదానీ గ్రూప్ షేర్లు ఇప్పుడు రంకెలు వేస్తున్నాయి. దీంతోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి మరీ గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఇప్పుడు అయన ఆసియాలోనే నెంబర్ వన్ సంపన్నుడిగా అవతరించారు. అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వివాదానికి సంబంధించి తాజాగా సుప్రీం కోర్టు కొత్తగా ఎలాంటి విచారణలు అవసరం లేదు అని..సెబీ విచారణే సరిపోతుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వచ్చినప్పటినుంచి స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అన్ని లాభాలతో దూసుకెళ్లాయి. దీంతో అదానీ గ్రూప్ సంపద గణనీయంగా పెరిగింది. స్టాక్ మార్కెట్ ర్యాలీ తో ఒక్క రోజులోనే అదానీ సంపద ఏకంగా 64 వేల కోట్ల రూపాయల మేర పెరిగి 97.6 బిలియన్ డాలర్లకు చేరింది.

దీంతో అయన ప్రపంచ సంపన్నుల జాబితాలో కూడా ముకేశ్ కంటే ముందుకు వెళ్లిపోయారు. అయితే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెద్దగా ఏమి లేదు అనే చెప్పాలి. ముకేష్ అంబానీ ఆస్తుల విలువ 97 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను బయటపెట్టింది. గ్రూప్ కంపెనీల స్టాక్ ధరలు పెంచేందుకు అదానీ గ్రూప్ పలు అక్రమాలు, మోసాలకు పాల్పడింది అని ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు గత ఏడాది ఈ నివేదిక బయటకు వచ్చాక భారీ నష్టాలను చవిచూశాయి. గత కొంత కాలంగా తిరిగి గాడిన పడిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే అదానీ తిరిగి ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడానికి ఎంతో సమయం పట్టక పోవచ్చు అని చెపుతున్నారు.

Next Story
Share it