విదేశీ పర్యటనలకు లైన్ క్లియర్
కరోనా ముప్పు తప్పింది. ప్రపంచ దేశాలు అన్నీ ఊపిరి పీల్చుకున్నాయ్. దీంతో విదేశీ పర్యటనలకు సంబంధించి ఇక పాత రోజులు వచ్చినట్లే. ఇప్పటికే పలు దేశాలు పర్యాటకులను అనుమతిస్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఆంక్షలు అమలు అవుతున్నాయి. దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థలను గాడినపెట్టేందుకు త్వరలోనే ప్రతి దేశం పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టడం అనివార్యం కానుంది. దీంతో అక్కడక్కడ ఉన్న ఆంక్షలు కూడా త్వరలోనే ముగియనున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత్ అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులకు అనుమతి మంజూరు చేసింది. మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎప్పటిలాగానే దేశం నుంచి పలు విదేశాలకు పర్యటనలు ప్లాన్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయిన వెంటనే ఎయిర్ లైన్స్ గతంలో ఉన్న తరహాలో అన్ని సర్వీసులు ఒకే సారి ప్రారంభించే అవకాశం ఉండదు.
ఎందుకంటే ఆయా రూట్లలో ఉండే ట్రాఫిక్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని క్రమక్రమంగా సర్వీసులను గతంలో ఉన్నట్లు పెంచే ఛాన్స్ ఉంది. అంతే కానీ మార్చి 27 నుంచి ఒకేసారి గతంలో ఉన్న తరహాలో సర్వీసులు ప్రారంభం కావటం కష్టమే. అయితే అత్యంత కీలకమైన పర్యాటక సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ లభించటం విమానయాన రంగానికి కొంతలో కొంత ఊరట లభించే అంశమే. విమానయాన రంగంతో పాటు పర్యాటక పరిశ్రమకు అత్యంత కీలకంగా మారిన ఈ సమయంలో విమాన ఇంథనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగటం ఒకింత ఆందోళన కలిగించే అంశమే. ఈ ధరల పెరుగుదల కారణంగా టిక్కెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న తరుణంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్ లైన్స్ తొలుత ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.