Telugu Gateway
Top Stories

గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
X

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న లాక్ డౌన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లే కన్పిస్తోంది. అదే సమయంలో మే నెలాఖరు నాటికి..జూన్ మధ్య నాటికి కరోనా రెండవ దశ తగ్గుముఖం పడుతుందనే అంచనాలు కూడా నిజం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్న కేసులే. ఏకంగా ప్రపంచంలోనే కొత్త రికార్డులు నమోదు చేస్తూ నాలుగు లక్షలు దాటేసిన ఒక్క రోజు కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తూ..మూడు లక్షలకు..ఇప్పుడు రెండు లక్షల దగ్గరకు వచ్చాయి. గత 24 గంటల్లో గంటల్లో కొత్తగా 2, 22,315 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్తగా రెండు లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, 4,454 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నా..మరణాలు మాత్రం అలాగే కొనసుతున్నాయి. ఇది ఒకింత ఆందోళనకర పరిణామంగా ఉంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 27,20,716 కొవిడ్‌-19 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 3, 02, 524 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏప్రిల్‌ 15 తర్వాత ఇప్పుడే ఇంత తక్కువ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా మరణాలు అధికారికంగా మూడు లక్షలు దాటాయి. దీంతో ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో(1.13 శాతం) నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా తమిళనాడు 35 వేల కేసులు,మహారాష్ట్రలో 26 వేల కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక 25 వేల కేసులతో మూడో స్థానంలో నిలిచింది. శనివారం దేశం మొత్తం19 లక్షల 28 వేల 127 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు(మొత్తం 33 కోట్లకు పైనే) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రకటించింది.

Next Story
Share it