పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యాటకం పడకేసింది. ఆ దేశం..ఈ దేశం అని లేకుండా అందరూ ఆంక్షలు పెట్టి సరిహద్దులు మూసివేయటంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయాలరు. ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు సరిహద్దులను తెరవటమే కాదు..ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తేస్తున్నాయి. శ్రీలంక కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ తోపాటు పలు దేశాల పర్యాటకులకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. కోవిడ్ కు ముందు భారత్ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు శ్రీలంకకు వెళ్లే వారు. తాజాగా శ్రీలంకకు చెందిన పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారత్ పర్యాటకులతోపాటు పలు దేశాల వారికి ఆన్ అరైవల్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ) ఇవ్వనున్నారు.
అయితే అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ మార్గంలోనే వీసా తీసుకోవటానికి ప్రయత్నించాలని సూచించారు. అయితే శ్రీలంక వెళ్ళే పర్యాటకులు విధిగా ఆరోగ్య బీమా తీసుకోవాలని నిబంధన పెట్టారు. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆస్పత్రి ఛార్జీలు చెల్లించేలా ఈ బీమాను తప్పనిసరి చేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాలంటే తప్పనిసరి బీమా తీసుకుని ఉండాలి. విమానం ఎక్కటానికి ముందు ఇది అవసరం లేదు. విమానాశ్రయంలో దిగిన తర్వాత అయినా ఈ బీమా తీసుకోవచ్చని తెలిపారు. శ్రీలంకే కాదు..పలు దేశాలు ఇప్పుడు పర్యాటకులను స్వాగతించి తిరిగి ఈ రంగాన్ని గాడిన పట్టే చర్యలు ప్రారంభించనున్నాయి.