Telugu Gateway
Top Stories

అంతర్జాతీయ సంస్థల అంచనాలు!

అంతర్జాతీయ సంస్థల అంచనాలు!
X

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం నాడు కూడా హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర క్రితం రోజుతో పోలిస్తే 3000 రూపాయలకు పైగా తగ్గి...149270 రూపాయలకు తగ్గింది. అయితే ఇది తాత్కాలికమే అని ఎక్కువ మంది చెపుతున్న మాట. 2026 సంవత్సరాంతం నాటికి బంగారం ధర 40 శాతం మేర పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే చెపుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి భారత్ లో 10 గ్రాముల బంగారం ధర 2 .13 లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉంది అని జె పీ మోర్గాన్ చేజ్ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. గతంలో మరికొన్ని సంస్థలు కూడా ఇంచుమించు ఇదే తరహా అంచనాలను వెలువరించాయి. 2026 చివరి మూడు నెలల కాలానికి ఔన్స్ బంగారం ధర 6000 డాలర్లకు చేరుతుంది అని....2027 చివరి నాటికి ఇది 6300 డాలర్లకు చేరుతుంది అని జె పీ మోర్గాన్ చేజ్ వెల్లడించింది. ఒక్క ఔన్స్ బంగారం అంటే 28 .34 గ్రాములు. అయితే మరికొంత మంది మాత్రం ఈ ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల రూపాయల నుంచి లక్ష ఏభై వేల రూపాయల మధ్య స్థిరపడవచ్చు అని అంచనాలు వేస్తున్నారు.

ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం ఆగిపోవటంతో గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. మరికొన్ని రోజులు ఇదే ట్రెండ్ కొనసాగినా కూడా ఈ ఏడాది చివరి నాటికి ధరలు పెరగటానికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నది నిపుణుల అంచనా. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కాపాడుకునేందుకు కేంద్రం కొద్ది రోజుల క్రితం బంగారం పై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇది బాగానే పని చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గత నెల రోజుల్లో బంగారం దిగుమతులు 70 శాతం మేర తగ్గాయి. సుంకం పెంచక ముందు ప్రతి నెలా బంగారం దిగుమతులు 75 నుంచి 100 టన్నులు ఉండగా...సుంకాలు పెంచిన తర్వాత ఇది ఏకంగా 25 నుంచి 30 టన్నులకు పడిపోయింది. మరో వైపు ప్రధాని మోడీ కూడా బంగారం కొనుగోళ్లు కొంతకాలం నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it