Telugu Gateway
Top Stories

బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్

బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్
X

వరసగా రెండు రోజులపాటు పెరిగిన బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. బంగారం..వెండి ధరలు తగ్గుముఖం ఎప్పటికి ఆగుతుంది అన్నది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. గరిష్ట ధరలతో పోలిస్తే ఇప్పటికే ఈ ఏడాది బంగారం ధర దగ్గర దగ్గర 32 శాతం మేర తగ్గుముఖం పడితే..వెండి ధర 33 శాతం మేర పతనం అయింది. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం నాడు 24 క్యారట్ల బంగారం ధర 2500 రూపాయలు తగ్గి 1,26,425 రూపాయలకు చేరింది. ముందు రోజు ఈ ధర 1,28,990 రూపాయలుగా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుతూనే వస్తోంది. తాజాగా వెండి ధర ఏకంగా కిలోకి ఐదు వేల రూపాయలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకునే పరిణామాలు ఆధారంగానే దేశీయంగా బంగారం, వెండి ధరల్లో కదలికలు ఉంటాయి అనే విషయం తెలిసిందే. కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1,21,875 రూపాయలుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కేజీ ధర 144547 రూపాయల వద్ద ఉంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ధరల ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరల్లో తగ్గుముఖం నమోదు అవ్వటానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెండి ధరల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. బంగారం, వెండి ధరల్లో స్థిరీకరణ జరిగి...ధరలు మళ్ళీ పాత రేట్లకు చేరుకోవాలంటే మాత్రం తక్కువలో తక్కువ రెండేళ్ల సమయం పడుతుంది అని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పై పెంపుపై తీసుకునే నిర్ణయం కూడా బంగారం భవిష్యత్ ధరలను నిర్ణయించబోతున్నాయి. ద్రవ్యోల్భణం పెరగటంతో ఇండియా లో కూడా వడ్డీ రేట్లు మరింత పెరగటం ఖాయం అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడి కోణంలో బంగారం లో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వాళ్ళు మాత్రం ఒకే సారి కాకుండా దశల వారీగా ధరలు తగ్గినప్పుడల్లా కొంత మేర కొనుగోలు చేయటం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్టంగా రేట్లు ఇంత వరకు తగ్గుతాయి..ఇక్కడ నుంచి ధరలు పెరుగుతాయి అని ఎవరూ చెప్పలేరు కనుక...అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా అప్పటి రేట్ల ప్రకారం పెట్టుబడి దారులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

Next Story
Share it