Telugu Gateway
Top Stories

జనవరి 5 నుంచి గోవా కొత్త విమానాశ్రయంలో సర్వీసులు

జనవరి 5 నుంచి గోవా కొత్త విమానాశ్రయంలో సర్వీసులు
X

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా. దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారనే విషయం తెలిసిందే. పర్యాటక పరంగా ఎంతో కీలకమైన గోవాలో ఇప్పుడు రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 2870 కోట్ల రూపాయలతో జీఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. డిసెంబర్ 11 న అంటే ఈ ఆదివారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ మోపా విమానాశ్రయాన్ని ప్రారంబించనున్నారు. అయితే ఇది జనవరి 5 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అంటే అదే రోజు నుంచి ఇక్కడ విమానాల రాకపోకలు స్టార్ట్ అవుతాయి.

ఈ నూతన విమానాశ్రయం గోవా పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వగలదని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని తొలుత ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నిర్మించారు. దీన్ని గరిష్టంగా మూడు కోట్లకు పైగా పెంచుకొనే ఛాన్స్ ఉంటుంది. మోపా విమానాశ్రయం నుంచి దేశీయ రూట్లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా సర్వీసులు నడుస్తాయి. ఈ కొత్త విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీనే 2016 నవంబర్ లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయనే దీన్నిప్రారంభిస్తున్నారు. తొలుత జీఎంఆర్ 40 ఏళ్ల పాటు దీన్ని నిర్వహిస్తుంది..తర్వాత మరో 20 ఏళ్ళు పొడిగించుకునే వెసులు బాటు రాయితీ ఒప్పందంలో ఉంది. ఇక్కడ నుంచి కార్గో రవాణా కూడా ఉంటుంది.

Next Story
Share it