దూద్ సాగర్ జలపాతం..భూమిని తాకుతున్న స్వర్గం
దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఆ సుందర ప్రదేశాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. అనూహ్య రీతిలో కురుస్తున్న వర్షాలకు చాలా మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గోవాలోని దూద్ సాగర్ జలపాతం ఎంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమో తెలిసిందే. అచ్చం పాలనురగ తరహాలో నీళ్ళు కిందకు జారుతుంటాయి. అందుకే దీనికి దూద్ సాగర్ పేరు వచ్చిందని చెబుతారు. తాజాగా ఈ జలపాతం ఫోటోలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతే కాదు..స్వర్గం భూమిని తాకుతుందని అంటూ కామెంట్ చేశారు.
ఇది సహజ సుందరంగా వచ్చిన అద్భుత ప్రదేశం అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గోవాతోపాటు కర్ణాటకలోని జలపాతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు వీటి అందాలను చూసేందుకు బయలుదేరుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా భారీ వర్షాలు కురుస్తున్నందున పలు జాగ్రత్తలతో ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.