Telugu Gateway
Top Stories

జీఎంఆర్ చేతికి ఇండోనేషియా మెడాన్ విమానాశ్ర‌యం

జీఎంఆర్ చేతికి ఇండోనేషియా మెడాన్ విమానాశ్ర‌యం
X

జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ అంత‌ర్జాతీయంగా మ‌రో కీల‌క ప్రాజెక్టు ద‌క్కించుకుంది. దీని ప్ర‌కారం కంపెనీ ఇండోనేషియాలోని మెడాన్ లో ఉన్న కౌల‌న‌ము అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అభివృద్ధి, విస్త‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం 25 సంవ‌త్స‌రాల పాటు అమ‌ల్లో ఉండ‌నుంది. ఈ విమానాశ్ర‌యం అభివృద్ధికి జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ విజ‌య‌వంత‌మైన బిడ్డ‌ర్ గా నిలిచిన‌ట్లు కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. జ‌కార్తాతోపాటు దేశంలోని మొత్తం 15 విమానాశ్ర‌యాల‌ను నిర్వ‌హించే అంగ్ కాసాపుర‌2 (ఏపీ2)తో జీఎంఆర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం చేసుకోనుంది. ఎంతో అభివృద్ధికి అవ‌కాశం ఉన్న ఇండోనేషియా విమాన‌యాన రంగ మార్కెట్లోకి ప్ర‌వేశించేందుకు త‌మ‌కు దీంతో అవ‌కాశం ల‌భించ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ప్రాజెక్టు ద‌క్కించుకోవ‌టం ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్లో విమానాశ్ర‌య ఆప‌రేట‌ర్, డెవ‌ల‌ప‌ర్ గా జీఎంఆర్ త‌న స‌త్తాను చాటింద‌ని తెలిపారు. జీఎంఆర్ ఏపీ2తో 49:51 భాగ‌స్వామ్య ఒప్పందం చేసుకోనుంది. 2018 సంవ‌త్స‌రంలో ఈ విమానాశ్ర‌యం 10 మిలియ‌న్ల ప్ర‌యాణికుల‌ను హ్యాండిల్ చేసింది. కౌల‌న‌ము అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం మంచి నిధుల ప్ర‌వాహం ఉన్న విమానాశ్ర‌యం అని తెలిపారు. ఈ సంవ‌త్స‌రాంతంలోపు ఒప్పందం పూర్తి అవుతుంద‌ని..విమానాశ్ర‌యం నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు జీఎంఆర్ చేతికి వ‌స్తాయ‌న్నారు. ఇండోనేషియాలోని కౌల‌న‌ము అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రాజెక్టు ద‌క్క‌టం ఎంతో ఆనందంగా ఉంద‌ని జీఎంఆర్ గ్రూప్ విమానాశ్ర‌యాల విభాగం ఛైర్మ‌న్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు.

Next Story
Share it