ఎయిర్ బస్ తో జీఎంఆర్ గ్రూప్ ఒప్పందం
ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ , జీఎంఆర్ గ్రూప్ లు గురువారం నాడు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నాయి. విమానయాన సేవలు, సాంకేతికత పరిజ్ఞానం, ఆవిష్కరణలలో గల అవకాశాలను అన్వేషించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బెంగుళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2021లో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. నిర్వహణ, విడి భాగాలు, శిక్షణ, డిజిటల్ మరియు విమానాశ్రయ సేవలతో సహా పలు విమానయాన సేవల వ్యూహాత్మక రంగాలలో గల అవకాశాలను అన్వేషించడానికి జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌బస్ కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా - దేశంలోని ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడానికి; వాణిజ్య, సైనిక విమానాల కోసం విస్తృత విమానయాన సేవలను అన్వేషించడానికి జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌బస్ పరస్పరం సహకరించుకుంటాయి. ఈ ఒప్పందంపై జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కిషోర్ మాట్లాడుతూ ''ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాల ఆపరేటర్లలో ఒకరిగా మేము ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యంపై చాలా ఆనందిస్తున్నాము.
మా పరస్పర బలాలు, మార్కెట్ ఉనికి సహకారంతో విమానయాన సంస్థలు, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం కోసం కనిపి పని చేస్తాం. విమానాశ్రయ కార్యకలాపాలు, ఎయిర్ కార్గో సరఫరా గొలుసు వంటి ప్రాంతాలలో నూతన ఆవిష్కారాల దిశగా మా కృషిని కొనసాగిస్తాం." అన్నారు. ''ఎయిర్‌బస్, జీఎంఆర్ గ్రూప్‌లు రెండూ మెరుగైన కార్యాచరణ, ఆవిష్కరణలకు కట్టుబడిన సంస్థలు. ఈ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాంతంలో ప్రపంచస్థాయి విమాన సేవలను అందించాలన్నది మా లక్ష్యం'', అని శ్రీ రెమి మెయిలార్డ్, మేనేజింగ్ డైరెక్టర్, ఎయిర్‌బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా, అన్నారు. "ఈ ప్రాంతంలోని విమానయాన సేవలను మరింత మెరుగుపరిచేందుకు మేము కలిసి పనిచేస్తాము.'' అని తెలిపారు.