మెడాన్ విమానాశ్రయ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్

ఇండోనేషియా మెడాన్ లోని కౌలనము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ చేపట్టింది. ఇండోనేషియాకు చెందిన ప్రభుత్వ సంస్థ అంగ్ కాసా పుర 2 (ఏపీ2)తో కలసి జీఎంఆర్ ఈ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను చూడనుంది. ఇందులో ఏపీ2కు 51 శాతం వాటా ఉండగా..జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కు 49 శాతం వాటా ఉంది. ఇండోనేషియా విమానయాన రంగంలో వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో విమానాశ్రయాల ఆపరేటర్, డెవలపర్ గా జీఎంఆర్ శక్తిని ఇది మరింత పెంచుతుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 25 సంవత్సరాల పాటు ఇది జాయింట్ వెంచర్ కింద కొనసాగనుంది.
ఇండోనేషియాకు చెందిన మంత్రుల సారధ్యంలో ఈ విమానాశ్రయ బాధ్యతలు చేపట్టిన తర్వాత జీఎంఆర్ గ్రూప్ విద్యుత్, విమానాశ్రయాల ఛైర్మన్ బొమ్మిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మెడాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇండోనేషియా పశ్చిమ అంతర్జాతీయ హబ్ గా మారుస్తామని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగానే తాము ఇందులో పాల్గొన్నామని తెలిపారు. మెడాన్ విమానాశ్రయంలో కొత్తగా చేసే మార్పులతో భారత్-ఇండోనేషియాల మధ్య పర్యాటక, వ్యాపార రంగాల్లో కూడా మంచి సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. 2021లో ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ బిడ్ ద్వారా దక్కించుకున్న విషయం తెలిసిందే. పలు దశల ఒప్పందాల తర్వాత ఇప్పుడు నిర్వహణ జీఎంఆర్ జాయింట్ వెంచర్ చేతికి వచ్చింది.



