Telugu Gateway
Top Stories

విమానాల రిపేర్లకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ కొత్త విధానం

విమానాల రిపేర్లకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ కొత్త విధానం
X

కారు రిపేర్ కు షెడ్ కావాలి. అలాగే విమానాల రిపేర్ కు హ్యాంగర్ కావాలి. అయితే సంప్రదాయ హ్యాంగర్ తయారు చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విమానాల నిర్వహణ, మెయింట్ నెన్స్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ వో) సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పలు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్ హ్యాంగర్ విషయంలోనూ వినూత్న మార్గానికి శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే తొలిసారి 'ఇన్ ప్లేటబుల్ హ్యంగర్'ను అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ హ్యాంగర్స్ తో పోలిస్తే ఇది ఎంతో సులువైన మార్గంగా ఉంటుంది. ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ రూపంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా విమానాల నిర్వహణ, సేవాపరంగా ఆసియాలో అత్యున్నత స్థాయికి చేరుకుంది జీఎంఆర్ ఏరో టెక్నిక్. భారతదేశం, ఆసియా ప్రాంతంలో ఇటువంటి హ్యాంగర్‌ను ఏర్పాటు చేసిన ఏకైక ఎంఆర్ వో జీఎంఆర్ ఏరో టెక్నిక్. ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్‌ను షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ నిర్వహణ, ఇంజిన్ లేదా ల్యాండింగ్ గేర్ పున:స్థాపనతో సహా పలు కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు.

అన్‌షెడ్యూల్డ్ మరమ్మతులు చేపట్టడానికి అందుబాటులో ఉన్న హ్యాంగర్‌ను సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది. దీనికి భిన్నంగా, ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సమయాన్ని తగ్గించేది. సాంప్రదాయిక హ్యాంగర్‌ను నిర్మించడంతో పోలిస్తే సమయం, డబ్బు ఆదా చేస్తుంది. అదే సమయంలో సాంప్రదాయిక హ్యాంగర్ యొక్క అన్ని పనులు చేస్తూనే, భద్రతా లక్షణాలను కలిగి ఉంటూ, సాంప్రదాయ హ్యాంగర్ స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ వన్-బే నారో బాడీ ఇన్‌ఫ్లేటబుల్ హాంగర్లో ఒక B737 లేదా A320 సిరీస్ విమానాన్ని ఉంచొచ్చు. ఇది ఇప్పటికే ఉన్న 7 బేల సామర్థ్యానికి అదనం. ఈ అదనపు లైన్‌తో, జీఏటీలో అదనంగా 15 నుండి 20 చిన్న బేస్ మెయింటెనెన్స్ చెక్‌లను లేదా సంవత్సరానికి 4 నుండి 5 లీజు చెక్ లను నిర్వహించవచ్చు. ఈ ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ జీవిత కాలం 10-15 సంవత్సరాలు.

వివిధ పరిమాణాలలో లభించే ఈ ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ ఆర్డర్ ప్రకారం తయారు చేయబడింది. సాంప్రదాయిక హ్యాంగర్ నిర్మాణం 18 నెలల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుండగా, గాలితో కూడిన హ్యాంగర్‌ను 3-4 నెలల్లో నిర్మించవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనిని విడదీయడానికి, తిరిగి నిర్మించడానికి కేవలం 1-2 నెలలు పడుతుంది. సాంప్రదాయిక హ్యాంగర్‌ను నిర్మించడంతో లేదా అద్దె/లీజులో ఇదే విధమైన సదుపాయాన్ని పొందడంతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన మరియు వేగవంతమైన మార్గం.

Next Story
Share it