బీజేపీ తొలి సీఎం

సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన శనివారం నాడే బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అద్యక్షతన శుక్రవారం నాడు కోల్ కతా లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష సమావేశంలో అమిత్ షా అధికారికంగా సువేందు అధికారి కొత్త సీఎం అని ప్రకటించారు. ఒకప్పుడు టిఎంసి అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన తర్వాత బీజేపీలో చేరారు. మమతా బెనర్జీని ఏకంగా రెండు సార్లు ఓడించారు కూడా. ఈ సారి పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుని మరీ బీజేపీ తమ పని పూర్తి చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కి కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీని ఇంటి దారి పట్టించటంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా...స్థానిక నాయకులు పక్కా గా ప్లాన్ చేసి అమలు చేశారు.
శనివారం కొలువుతీరనున్న బీజేపీ సర్కారుతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం అయినట్లే చెప్పాలి. ముఖ్యమంత్రి రేస్ లో రకరకాల పేర్లు తెరమీదకు వచ్చినా కూడా అందరి అంచనాల ప్రకారమే తొలి ఛాన్స్ సువేందు అధికారికే దక్కింది. పాలనలో సమతుల్యత కోసం ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ఒక డిప్యూటీ సీఎం పదవిని మహిళా నేతకు కేటాయించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ప్రాంతీయ సమీకరణలు దృష్టిలో పెట్టుకుని ఉత్తర బెంగాల్, గిరిజన ప్రాంతాలకు కేబినెట్‌లో పెద్దపీట వేయనున్నారని చెపుతున్నారు. శనివారం ఉదయం 11:00 గంటలకు కోల్‌కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
సువేందు అధికారి కూడా ఈ ఎన్నికల్లో రెండు చోట్ల భవానీపూర్, నందిగ్రామ్ ల్లో పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్‌లో మమతా బెనర్జీపై 15,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి 'జెయింట్ కిల్లర్'గా నిలిచారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. తాను ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు అని...బీజేపీ తమ దగ్గర నుంచి వంద సీట్లు లాక్కుంది అంటూ మమతా బెనర్జీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె తాను లోక్ భవన్ కు వెళ్ళను...రాజీనామా చేయను అంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నట్లే ఆమె సీఎం పదవికి రాజీనామా కూడా చేయలేదు. దీంతో గడువు ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ ఎన్ రవి రద్దు చేశారు. అదే సమయంలో మమతా బెనర్జీ క్యాబినెట్ ను కూడా డిస్మిస్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరటానికి మార్గం సుగమం అయింది.



