సుప్రీం షాక్...వ్యాక్సినేషన్ పై మోడీ కీలక ప్రకటన
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్
రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు
వ్యాక్సినేషన్ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. జూన్ 21 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ కు ఏ రాష్ట్రం కూడా రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో వ్యాక్సిన్ సరఫరా మెరుగుపడనుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. తాము అధికారంలోకి రాగానే 2014లో ఇంద్రధనస్సు కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. వ్యాక్సినేషన్ లో దేశం స్వయంసమద్ధిగా మారింది. ఏడాదిలో రెండు స్వదేశీ వ్యాక్సిన్లు తీసుకొచ్చామన్నారు. దేశంలో మొత్తంలో ఏడు సంస్థ లు వ్యాక్సిన్లు తయారుచేయనున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ దేశ ప్రజలకు 23 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు మోడీ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. ఈ శతాబ్దంలోనే భారత్ ఒక్కటే కాకుండా..ప్రపంచం ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ కరోనా అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
దేశం ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో వైద్య ఆక్సిజన్ కొరత ఎదుర్కొలేదన్నారు. అయినా ఈ సమస్యను తి తక్కువ సమయంలో అధిగమించగలిగామన్నారు. అతి తక్కువ సమయంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లు పెంచామన తెలిపారు. ఇలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశీయంగా తయారు అయిన వ్యాక్సిన్ ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటమన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేయకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి సంవత్సరాలు పట్టేదన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు అన్ని రకాల సాయం అందించామని మోడీ తెలిపారు. కరోనా రెండవ దశకు ముందు డాక్టర్లు,నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే ఏమి అయి ఉండేది అంటూ ప్రశ్నించారు. పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ల పై కూడా ప్రయోగాలు ప్రారంభం అయ్యాయన్నారు. దీంతోపాటు ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్ కూడా ప్రయోగాల దశలో ఉందని..ఇది కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాలు పెంచామని తెలిపారు .