Telugu Gateway
Top Stories

జీవితకాలాన్ని పెంచే నడక

జీవితకాలాన్ని పెంచే నడక
X

వాకింగ్ మంచిది అనే మాట ప్రతి డాక్టర్ చెపుతారు. రోజులో కనీసం ఒక అరగంట అయినా నడిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజా పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటి అంటే రోజుకు నాలుగు వేల అడుగులు నడిస్తే ఏ కారణంతో అయినా సరే మరణించే రిస్క్ తగ్గుముఖం పడుతుంది అని నిపుణులు తేల్చారు. యురోపియన్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక స్టడీ లో ఈ అంశాలను ప్రస్తావించారు. పోలాండ్ కు చెందిన సైంటిస్టుల బృందం గతంలో జరిగిన 17 పరిశోధనలకు సంబంధించిన విషయాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.ఏకంగా 226889 మందిని పరిశీలించి ..వారి డేటా ఆధారంగా ఈ విషయాన్నీ తేల్చారు. రోజులో 2337 అడుగులు నడిస్తే కార్డియోవాస్క్యూలర్ జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది అని తేల్చారు. అయితే నడకకు సంబంధించి రోజుకు ఎన్ని అడుగులు నడవాలి అనే అంశంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా నడక ఎవరికైనా ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది అని తెలిపారు. వ్యాయామంలో నడకను అతి తక్కువగా అంచనా వేస్తారు అని..కాని దీని వల్ల ఫిట్ నెస్ రావటంతో గుండె సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు అవటమే కాకుండా ..నిరాశ, అలసటను తగ్గించటానికి కూడా వాకింగ్ ఎంతో ఉపయోగ పడుతుంది అని పరిశోధకులు తేల్చారు. అంతే కాదు కాన్సర్ రిస్క్ ను తగ్గించటంతో పాటు ఇతర తీవ్ర జబ్బులను అడ్డుకుంటుంది అని తెలిపారు. కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో శారీరక శ్రమ తప్పని సరి అని..ఇది లేకే పెద్ద ఎత్తున మరణాలు నమోదు అవుతున్నాయని...ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఇది నాల్గవ స్థానంలో ఉంది అని పరిశోధనలో తేలింది. సో ఏ మాత్రం ఖర్చు లేకుండా చేయదగ్గ వ్యాయామం కూడా వాకింగ్ అనే విషయం తెలిసిందే. మరి వీలు చూసుకుని వెంటనే స్టార్ట్ చేయండి నడవటం.

Next Story
Share it